ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణకు డిమాండ్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. తన ఫోన్ ట్యాప్ అవుతోందని ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఈ సారి టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా.. ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని.. ఇది దేశభద్రతకు భంగం కలిగించడమేనని చెబుతూ.. తక్షణం విచారణ చేయించాలని కోరుతూ… కేంద్ర ప్రభుత్వానికి.. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 19 మరియు 21 ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతోందని… ప్రతిపక్ష నేతలు, న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని… ప్రజా స్వామ్య వ్యవస్థలను నాశనం చేయాలనుకుంటున్నారని చంద్రబాబు లేఖలో ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడులు చేసి బెదిరిస్తున్నారని.. ఫోన్లను చట్టవిరుద్ధంగా ట్యాపింగ్ చేయడం దినచర్యగా మారిందన్నారు. ఇది ఆర్టికల్ 19 మరియు ఆర్టికల్ 21లో హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులకు ఉల్లంఘించడమేనని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. ఇల్లీగల్ సాఫ్ట్వేర్ ద్వారా, చట్టవిరుద్ధంగా ఈ ట్యాపింగ్ జరుగుతోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు దీర్ఘకాలంలో జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పు తెచ్చే అవకాశం ఉదని…. ఇటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం దుండగుల చేతిలో ఉండడం ప్రమాదకరం అన్నారు. అత్యున్నత స్థానాల్లోని వ్యక్తులను తమ దారికి తెచ్చుకోడానికి బ్లాక్ మెయిలింగ్, బెదిరింపులకు గురిచేయడానికి నేర మనస్థత్వం ఉన్న వారు ఉపయోగించుకునే ప్రమాదం ఉందన్నారు. న్యాయవ్యవస్థను కూడా లక్ష్యంగా చేసుకుందని ఇటీవలి పరిణామాలు నిరూపిస్తున్నాయన్నారు.
ప్రైవేటు వ్యక్తులు కూడా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజి, పరికరాలు వినియోగించి ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోందన్నారు. కట్టడి చేయకపోతే ఎన్నో ఏళ్లుగా కష్టపడి నిర్మించుకున్న వ్యవస్థల విధ్వంసానికి దారితీస్తుందన్నారు. ఫోన్ ట్యాపింగ్ వంటి అక్రమాలు, చట్టవిరుద్ద చర్యలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ద్వారా విచారణ చేయించాలని చంద్రబాబు లేఖలో కోరారు.
Click here to view Chandrababu Naidu letter to Prime Minister