రాష్ట్ర మంత్రి నారాలోకేశ్ వచ్చే ఎన్నికల్లో టిడిపికి 175 స్థానాలు వస్తాయని అన్నప్పుడు అదేదో అత్యుత్సాహంతో అన్నమాట అని అందరూ సరిపెట్టుకున్నారు. కాని ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్వయంగా అదే మాట చెప్పడంతో ఇది యాదృచ్చికం కాదని స్పష్టమవుతున్నది. బహుశా చంద్రబాబు ఎప్పుడూ చెప్పే మైండ్ మేనేజిమెంటులో భాగంగా 175 పల్లవి సాగించాలనుకున్నట్టు అర్థమవుతుంది. వైసీపీ గల్లంతై పోవాలని ఎన్నికలు ఏకపక్షంగా జరగాలని చంద్రబాబు నాయుడు పదేపదే చెప్పడం మామూలు రాజకీయ ధోరణికి భిన్నంగా వుంది. ప్రతి 25 కుటుంబాలకు ఒక కార్యకర్తలను ఒక డ్వాక్రా మహిళలను నియమిస్తామని చెబుతున్నారు. మరి డ్వాక్రా సంఘాలు టిడిపి రాజకీయ పరిధిలోకి ఎలా వస్తాయి? ప్రభుత్వంపై 40 శాతం మంది అసంతృప్తితో వున్నట్టు సర్వేలో తేలిందని ఆయనే చెప్పారు. ఇదేం తక్కువ కాదు, పెరగదనీ లేదు. అదే నిజమైతే 175 స్థానాలు ఎలా వస్తాయి? దేశంలో ప్రతిపక్షం అవసరమే లేదని ఒకప్పుడు ఇందిరాగాంధీ అంటుండే వారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు కూడా అదే ధోరణి పట్టుకున్నట్టుంది. ఆ సమయంలో ఆయన ఇందిరా కాంగ్రెస్‌లోనే వుండి వుంటారు . అయితే గుత్తాధిపత్యం అన్నది ఆమెతోనే పోయిందని ప్రతివారూ అర్థం చేసుకోవడం అవసరం. మరీ అంతా మేమేనన్నట్టు వ్యవహరిస్తే మొదటికే మోసం రావచ్చు.