తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన నేతృత్వంలో 2004, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు ఎన్నికల్లో ఓడిపోవడానికి తానే కారణం అన్నారు. పరిపాలనలో పడి పార్టీని పట్టించుకోకపోవడం వల్లనే ఓటమి ఎదురయిందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో కొన్ని పనులు చేయలేకపోయానన్నారు. ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తే ప్రజలు మళ్లీ మళ్లీ గెలిపిస్తారని అన్నారు.
2004, 2019 రెండు సార్లు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పరాజయం పాలైంది. 1994, 1999 ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఘన విజయం సాధించింది. 1994లో ఎన్టీఆర్ నేతృత్వంలో టీడీపీ ఎన్నికలకు వెళ్లింది. లక్ష్మి పార్వతి కారణంగా ఎమ్మెల్యేలంతా చంద్రబాబును లీడర్ గా ఎంచుకున్నారు. ఆయన పాలనలో మంచి పనితీరు కనబర్చడంతో 1999లో ప్రజుల మళ్లీ గెలిపించారు. అయితే 2004కి వచ్చేసరికి చంద్రబాబు అభివృద్ధి అంతా ఒక్క చోటే చేస్తున్నారన్న ప్రచారంతో పాటు అధికార వ్యతిరేకత తోడు కావడంతో పరాజయం పాలయ్యారు.
ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం.. ఇతర కారణాలతో మళ్లీ రాష్ట్ర విభజన తర్వాతనే అధికారం లభించింది. 2014లో మళ్లీ చంద్రబాబు విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిన పెడతానని గెలవగానే రాజకీయం మానేసి పూర్తిగా పాలపై దృష్టి పెట్టారు. దీంతో 2019లో ఊహించని పరాజయం ఎదురైంది. ఆ పరాజయాలకు కారణం తానేనని చంద్రబాబు చెబుతున్నారు. మరి ఈ సారి అలాంటి తప్పులు జరగకుండా చంద్రబాబు చూసుకుంటున్నారా అన్న ప్రశ్నలు టీడీపీ క్యాడర్ నుంచి సహజంగానే వస్తున్నాయి.