ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏం చేసినా అంతర్జాతీయ స్థాయిలో ఉండాలని కోరుకుంటారు. రాజధాని అమరావతి నిర్మాణాన్ని కూడా ఆ స్థాయిలోనే చేయాలనుకుంటున్నారు. అందుకే, డిజైన్ల దగ్గర నుంచీ రూపకల్పన అంతా విదేశాల్లోనే చేయిస్తున్నారు. మంచిదే.. నవ్యాంధ్రను ప్రపంచపటంలో ప్రత్యేకంగా నిలపాలన్న తలంపులో ఆయన ఉన్నారు. అందుకే, దాదాపు మూడున్నరేళ్లుగా రాజధాని డిజైన్లపై బాగా కసరత్తు చేస్తున్నారు. అయితే, ఈ ‘అంతర్జాతీయ స్ధాయి’ అనేది ఏదైతే ఉందో.. దాన్ని వ్యవసాయానికి కూడా ఇప్పుడు ఆపాదిస్తున్నారు! మన వ్యవసాయ రంగాన్ని ఆ స్థాయిలో చూడాలని ఆకాంక్షిస్తున్నారు.
తన చివరి రక్తపు బొట్టు వరకూ రైతుల సంక్షేమానికే కట్టుబడి ఉంటానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లు ఉన్నప్పుడు ఐటీ రంగాన్ని అత్యంత ప్రాధాన్యత ఇచ్చానన్నారు. ఫలితంగానే అంతర్జాతీయ స్థాయిలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నత స్థాయిలో నిలిచిందన్నారు. నవ్యాంధ్రలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామనీ, సాగును రైతులకు అత్యంత లాభదాయకంగా మార్చే సంకల్పంతో ఉన్నాను అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నవ్యాంధ్ర వ్యవసాయ రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలపాలన్నది తన ధ్యేయం అని చంద్రబాబు చెప్పారు. కర్నూలు జిల్లాలోని తంగడంచలో మెగా సీడ్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి ఇలా మాట్లాడారు. దేశంలోనే నంబర్ వన్ సీడ్ పార్క్ అభివృద్ధి చేసే బాధ్యతను తాను తీసుకున్నాను అని చెప్పారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతల్ని మరోసారి రాక్షసులతో పోల్చారు! ఒక పక్క అభివృద్ధి యజ్ఞం జరుగుతూ ఉంటే, కొంతమంది రాక్షసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సోమవారాన్ని పోలవారంగా మార్చుకుని పనిచేస్తుంటే, వారు ఏదో ఒక ఆటంకం కల్పించే ప్రయత్నం చేస్తున్నారనీ, ప్రజలు అంతా చూస్తున్నారనీ, వారికి బుద్ధి చెబుతారని సీఎం చెప్పారు.
వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వాడకం పెరగడం వరకూ బాగానే ఉంది. కానీ, ఈ లక్ష్యాన్ని కూడా ‘అంతర్జాతీయ స్థాయి’ అనే ఒక మార్క్ పెట్టుకుని, దాన్ని అందుకోవాలనే లక్ష్యంతోనే సీఎం ఇవన్నీ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది! ప్రతీదానిలో అంతర్జాతీయ స్థాయి అవసరమే. కానీ, దాన్నే ప్రాథమిక లక్ష్యంగా, ఒక కొలమానంగా పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది..? మనం చేస్తున్న పని అత్యుత్తమంగా ఉంటే ఆ స్థాయి తనంతట తానే వస్తుంది కదా! వ్యవసాయ రంగమే తీసుకుంటే.. క్షేత్రస్థాయిలో చాలా సమస్యలున్నాయి. గొప్పగా చెప్పుకుంటున్న పోలవరం ప్రాజెక్టు కానీ, ఇతర పథకాలుగానీ ఇంకా పూర్తి కాలేదు. రుణమాఫీయే అర్హులైనవారికి ఇంకా అందాల్సి ఉందని ప్రభుత్వమే లెక్కలు చెబుతోంది. ఇంకోపక్క మద్దతు ధర, రైతులకు రుణ లభ్యత కూడా సమస్యగానే ఉంది. మొన్నటికి మొన్ననే కదా.. రుణాల విషయమై బ్యాంకర్లకు మంత్రులు క్లాస్ తీసుకున్నది. ఇవన్నీ అధిగమించిన తరువాత.. అంతర్జాతీయ స్థాయి కల్పనే నా ధ్యేయం అని చెబితే వినడానికి బాగుంటుంది! ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.. ఇవన్నీ పరిష్కారం అయ్యాక, ఆ స్థాయి ఏదో అదే వస్తుంది కదా..!