ఆ విధంగా ముందుకు పోదాం… అలా ముందుకు సాగుదాం.. ఇలా ముందుకు వెళ్ళాం… ఇవీ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పడికట్టు పదావళి. ముందుకెడదాం అంటూ ఆయననే పదంలో అభివృద్ధి సాధిద్దాం.. సాధించాం.. సాధించాలి.. శోధించాలి.. ఇలా రకరకాల అర్థాలు చెప్పుకోవచ్చు. ఈ అలవాటు ఆయనకు తన పూర్వీకుల నుంచో సాహచర్యం వల్లనో వచ్చి ఉండవచ్చు. మీడియాకు ఏమైంది.. అవే పదాలతో వార్తలు రాసేయడం.. అదే పదంతో స్క్రోలింగులు ఇచ్చేయడం. జర్నలిస్టులలో ఆ పదం పట్ల ఇష్టం పెరిగిపోయిందా.. లేక అదే పదాన్ని వాడి చంద్రబాబు మన్ననలు పొందాలనుకుంటున్నారా. ఏదైనా సందర్భంలో వాడాల్సిన పదం మదిలో మెదలకపోతే.. తమకు అలవాటైన పదాన్ని వాడేస్తుంటారు నాయకులు. అదే ఒరవడిన నేటి తరం జర్నలిస్టులు ఉరవడిగా మార్చుకున్నారు. జవహర్ లాల్ నెహ్రూ నుంచి నరేంద్ర మోడీ వరకూ దేవెగౌడ వంటి కొద్దిమందిని మినహాయిస్తే ఎవరూ వ్యర్థ పదాలను ఉపయోగించలేదు. పివి నరసింహారావు వంటి నేతలు తమకున్న బహుభాషా పరిజ్ఞానాన్ని ప్రజలపై రుద్దాలనుకోలేదు. అలతి అలతి పదాలతో ప్రసంగించారు. ఆకట్టుకున్నారు. వారి ప్రసంగాలలో కొత్త పదాల ప్రయోగానికీ వారు పూనుకోలేదు. వారి ప్రసంగాలను ఆసక్తిగా వినాలనిపించేది. ఆ ఒరవడిని జర్నలిస్టులు పదేళ్ళ క్రితం వరకూ కొనసాగించారు. అయితే, కానీ, ఇలా ఉండగా.. మరొకవంక అనుసంధాన పదాలూ జర్నలిజంలో కనిపించేవి కావు. ప్రస్తుత జర్నలిజాన్ని పరిస్థితి అనే పదం శాసిస్తోంది. అది క్రైమయినా.. శుభకార్యమైనా.. మందుపాతరైనా.. ఘోరమైనా.. ప్రధాన మంత్రి వార్తయినా `పరిస్థితి` అనే పదాన్ని రెండు నిముషాల వ్యవధిలో మీడియా మిత్రులు పదులసార్లు వినియోగిస్తున్నారు. ఈ పదం కూడా చంద్రబాబుగారి నుంచి సంక్రమించిందే. ఇలా అనడం ఆయన్ను తప్పు పట్టడానికి కాదు. ఆయన అలవాటు. ఆ అలవాటు జర్నలిస్టులు ఎందుకు పుణికిపుచ్చుకోవాలి? ఎందుకు పదేపదే వాడాలి? ఎందుకు న్యూస్ ఎడిటర్లు వాటిని ప్రోత్సహించాలి? ఈ పదాలను పదేపదే వాడడం వల్ల వీక్షకులు ఇబ్బంది పడతారని వారికి అనిపించకపోవడమా. పత్రికా భాషను అనన్య సామాన్యంగా తయారు చేసిన ఘనత కచ్చితంగా ఈనాడుదే. ఆ ఘనతతో పాటు వ్యర్థ పదాలనూ, కొన్ని ఈసడించుకునే మాటలనూ, అర్థం లేని అనువాదాలనూ కూడా ఆ పత్రిక జనాల నెత్తిన రుద్దుతోంది. కాఫర్ డ్యాం అనే పదానికి అర్థం కూడా తెలియకుండా.. కాపర్ డ్యాం అని రాస్తున్నారు. దాదాపు అన్ని పత్రికలకూ జర్నలిజం స్కూళ్ళున్నాయి. అనుభవజ్ఞులైన అధ్యాపకులున్నారు. శిక్షణ దశలోనే వారెందుకు ఈ అంశాలను బోధించడం లేదు. ఎలా రాయాలి.. ఏ పదం ఆయాలి.. ఎక్కడ ఏ సందర్భానికి ఏ పదం అతుకుందీ అనేది చెబుతున్నారా అనే అంశాన్ని వారు బేరీజు వేసుకోవాలి. లేకపోతే… ముఖ్యమంత్రులు వాడే `ముందుకు` వంటి పదాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. పరిస్థితి.. ముందుకు వంటి అనేక పదాలు చంద్రబాబు ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చేశాయి. అవి జర్నలిజంలోకి చొచ్చుకుపోయాయి. ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక పథకాలకు తెలుగు పేర్లు పెట్టారు. అచ్చ తెనుగులో మాట్లాడేవారు. ఆ కాలంలో జర్నలిస్టులు ఆ శైలిని పుణికిపుచ్చుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు ధోరణిని సొంతం చేసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రగతిపైన మాట్లాడేటప్పుడైనా.. సంతాప సందేశం ఇచ్చేటప్పుడైనా ఆయన ఆ విధంగా ముందుకు అనే పదాన్ని వాడతారు. అదే నేటి మీడియా శైలిగా మారిపోయింది.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి