రిజర్వేషన్ల కోసం కాపులు ఎప్పటి నుంచో ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే . ముద్రగడ పద్మనాభం అధ్యక్షతన కాపులు ఉద్యమిస్తున్నా… అడుగడుగునా అడ్డుపుల్ల వేయడమే తెలుగుదేశం సర్కారు పని అన్నట్టుగా తీరు ఉంది. ఉద్యమం అంటే చాలు.. ముందుగా ముద్రగడను గృహ నిర్బంధం చేయడం ఓ రొటీన్ రియాక్షన్‌గా మారిపోయింది. సరే, ఏం చేసినా కాపుల రిజర్వేషన్ల ఇష్యూ అనేది చాపకింద నీరులా ఆ సామాజిక వర్గంలో తన విస్తృతిని పెంచుకుంటూ ఉందనేది ముమ్మాటికీ నిజం. ఆ సంగతి తెలుసు కాబట్టే… రిజర్వేషన్ల ఉద్యమాన్ని నీరుగార్చే కొత్త ఎత్తు వేస్తోంది ఏపీ సర్కారు! కాపులకు చాలా చేసేశాం అనే ప్రచారం మొదలుపెట్టింది. ఈ బాధ్యతను ఆ సామాజిక వర్గానికి చెందినవారు కొందరు భుజానికెత్తుకోవడం విశేషం..!
తాజా ఏపీ బడ్జెట్లో సామాజిక వర్గాల సమతౌల్యత పాటించిన సంగతి తెలిసిందే! ప్రజాస్వామ్యంలో కులాల ప్రస్థావన ఏ స్థాయికి వచ్చాయనేది ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేని అంశం. సరే, ఈ కేటాయింపుల్లో భాగంగా కాపు కార్పొరేషన్‌కు రూ. 1000 కోట్లను బడ్జెట్లో ఆర్థిక మంత్రి యనమల కేటాయించారు. అయితే, ఇప్పుడు ఈ నిధులు చాలా ఎక్కువ అన్నట్టుగా ఉబ్బి తబ్బిబ్బైపోతోంది కాపు కార్పొరేషన్! కాపు నేతలంతా వరుసగా చంద్రబాబును కలుస్తున్నారు. ఈ కార్పొరేషన్ ఛైర్మన్ నేతృత్వంలోని కొంతమంది పెద్దలు ముఖ్యమంత్రికి ఘన సన్మానం చేసేశారు. కాపుల ఉద్ధరణ కోసం ఆశించిన దానికంటే అధికమే చేశారంటూ చంద్రబాబును ఓ రేంజిలో పొగడ్తలతో ముంచెత్తారు.
అయితే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే… బడ్జెట్లో జరిగింది కేవలం కేటాయింపులు మాత్రమే. అలా కేటాయించిన నిధులు సక్రమంగా విడుదల కావాలి, క్షేత్రస్థాయిలో పనులు జరగాలి, సత్ఫలితాలు రావాలి… మధ్యలో ఇంత తతంగం ఉంది. కనీసం ఓ ఏడాది దాటక ప్రభుత్వ పనితీరు చూశాక ఇలాంటి సన్మాన కార్యక్రమాలు పెట్టుకుంటే ఒక అర్థం ఉంటుంది. అంతేగానీ, ముందుగానే ఈ సత్కారాలేంటో.. అని అనిపిస్తున్నా, వీటిని కొట్టిపారేయలేం సుమండీ! దీని వెనకా ఓ లెక్క కనిపిస్తోంది కదా! ఎన్నికల ముందు కాపులకు ఇచ్చిన హామీలేవీ ఇంతవరకూ అమలు కాలేదని ముద్రగడ ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. దాన్ని ఇంకాస్త నీరు గార్చాలంటే… ఇప్పటికే కాపుల కోసం చాలాచాలా చేసేశాం అనే ప్రొజెక్షన్ టీడీపీ సర్కారుకు అవసరం కదా! అందుకే, బడ్జెట్ కేటాయింపుల్ని ఈ రకంగా వాడుకుంటోందన్న అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తీకరిస్తున్నారు. ఇదొక్కటే కాదు.. బడ్జెట్ అద్భుతః అంటూ కేకులు కట్ చేస్తున్న మంత్రులు కూడా కొంతమంది ఉన్నారు..! జరిగినవి కేవలం కేటాయింపులు మాత్రమే కదా! చేయాల్సిన అమలు ఇంకా మిగిలే ఉంది కదా!