నంద్యాల ఉప ఎన్నికను రెఫరెండమ్ అనీ, కురుక్షేత్ర సంగ్రామానికి ఆరంభమనీ ఇలాంటి భావోద్వేగాలతో బరిలోకి దిగారు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి. దాదాపు 13 రోజులపాటు నియోజక వర్గం అంతా పర్యటించి ఇదే అంశాన్ని చెబుతూ వచ్చారు. అయితే, అనూహ్య మెజారిటీతో తెలుగుదేశం విజయం సాధించడంతో ఆ మాట మార్చేశారు. ఇది రెఫరెండమ్ ఎలా అవుతుందీ అంటూ కొత్త వాదన వినిపించే ప్రయత్నం చేశారు. సరే, ఈ ఫలితాన్ని వైకాపా ఎలా చూస్తోందనేది ఇప్పుడు చర్చ కాదు. వైకాపా ఓటమిని రాష్ట్ర ప్రజలకు తెలుగుదేశం ఎలా చూపించే ప్రయత్నం చేస్తోందనేదే ఇక్కడ గుర్తించాల్సిన విషయం. నంద్యాల, కాకినాడ విజయం టీడీపీకి కొత్త ఊపు ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదే సమయంలో ప్రతిపక్షాన్ని మరింతగా తొక్కేసేంత బలం చేకూరినట్టుగా కూడా వారు భావిస్తున్నారనడంలో కూడా సందేహం లేదు!
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా నంద్యాలకు వచ్చారు. పొదుపు సంఘాల మహిళలతో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీ పాత్రపై మరోసారి విమర్శలు చేశారు. వైకాపాకి దిశా నిర్దేశం లేదనీ, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం ఒక్కటే పనిగా పెట్టుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషించడంలో ఘోరంగా విఫలమయ్యారు అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైకాపాకి డిపాజిట్లు దక్కవని జోస్యం చెప్పారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో విజయం తమ బాధ్యతని పెంచిందనీ, రాష్ట్ర అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతీ పనినీ జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనీ, కానీ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా తాము పని చేస్తున్నామన్నారు.
ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు మాట్లాడినా వైకాపాపై వేస్తున్న ముద్ర ఏంటంటే… ‘అభివృద్ధిని అడ్డుకుంటున్నారు’ అనేది! నంద్యాల ఉప ఎన్నికలో కూడా ఇదే రీతిన ప్రచారం చేశారు. అది వర్కౌట్ అయింది. 2019 ఎన్నికల్లో కూడా వైకాపాపై ఇదే ముద్రను ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చుకుంటారు. గత ఎన్నికల్లో జగన్ ది లక్ష కోట్ల అవినీతి అంటూ టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. రాబోయే ఎన్నికల్లో ‘జగన్ అభివృద్ధి నిరోధక శక్తి ’అనే ప్రచారం చేస్తుందనే అనిపిస్తోంది. ఈ విషయాన్ని వైకాపా గుర్తిస్తున్నట్టు లేదు! ఎప్పటికప్పుడు వైకాపా మీద అభివృద్ధి నిరోధకులు అనే ముద్ర వేయడం ద్వారా.. తాము చేసిన కార్యక్రమాల గురించి చెప్పుకుంటూ, ప్రచారం కల్పించుకునే అవకాశాన్ని చంద్రబాబు సృష్టించుకుంటున్నారు. గత కొంతకాలంగా వైకాపా మీద వేస్తున్న ఈ స్టాంప్ గురించి ఆ పార్టీ ఆలోచించకపోతే, ఇది మరో నిర్లక్ష్యంగా మారే అవకాశం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం.
అధికారంలో ఉన్న పార్టీకి సహజంగానే అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. నిధులూ నిర్వహణా అంతా వారి చేతిలో ఉంటుంది కాబట్టి. పరిపాలన సాగించే అధికార హోదాలో వారు ఉంటారు కాబట్టి. ప్రశ్నించడం తప్ప ప్రతిపక్షం ఏమీ చేయలేదు. అయితే, ఈ సాధారణ పరిస్థితిని కూడా తమకు అనుకూలంగా టీడీపీ మార్చుకునే ప్రయత్నంలో ఉంది. ఈ క్రమంలోనే వైకాపా మీద ఆ ముద్ర వేస్తున్నారు! ఈ విషయాన్ని వైకాపా ఇప్పటికైనా అర్థం చేసుకోకపోతే.. ఇబ్బందే!