మెల్లగా ఎలాగోలా నాయకుల మధ్య సయోధ్య కుదిర్చి, అసంతృప్తులను తగ్గించి, అవసరమైతే బుజ్జగించి.. ఇలా నెమ్మదిగా ఎన్నికల నాటికి కావాల్సిన కలిసికట్టుతనాన్ని సాధించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు తనవంతు ప్రయత్నాలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే, ఇంకోపక్క నుంచి కొంతమంది నాయకులు తమ పాత ధోరణిని వదులుకుంటున్నట్టుగా లేదు! ఎవరికివారు తమ బల ప్రదర్శనలకు తెర వెనక సన్నాహాలు చూసుకుంటూ ఉంటే.. చంద్రబాబు మరోసారి జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి తప్పదనే అనిపిస్తోంది. ఇలాంటి వాతావరణం ఇప్పుడు ఆళ్లగడ్డలో మరోసారి నెలకొన్నట్టు తెలుగుదేశం వర్గాల్లో చర్చ జరుగుతోంది.
నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా కర్నూలు జిల్లా టీడీపీ శ్రేణులన్నీ ఒక తాటిపైకి వచ్చాయి. నిజానికి, అదే సమయంలోనే మంత్రి భూమా అఖిల ప్రియ.. భూమా ప్రధాన అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఉన్న విభేదాలపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి వచ్చింది. ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానంద రెడ్డిని గెలిపించడం కోసం వీరి మధ్య సయోధ్య కుదిర్చారు. సమీప భవిష్యత్తులో సుబ్బారెడ్డికి ప్రాధాన్యత ఇస్తామంటూ భరోసా కల్పించారు. దాంతో ఆ ఎన్నిక వరకూ టీడీపీ వర్గాల్లో కలిసికట్టుతనం సాధ్యమైంది. ఫలితంగా ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుపు నల్లేరు మీద నడక అయింది. అయితే, ఇప్పుడు మళ్లీ పరిస్థితి మొదటికి వచ్చినట్టు సమాచారం! ప్రస్తుతం సుబ్బారెడ్డి అలకబూనినట్టు సమాచారం. నిజానికి, ఆర్టీసీ ఛైర్మన్ పదవి కోసం ఏవీ సుబ్బారెడ్డి పేరును సీఎం పరిగణనలోకి తీసుకున్నారు, కానీ ఆయనకి ఇవ్వలేదు. దాంతో ఆయన కొంత అసంతృప్తికి గురైనట్టు చెబుతున్నారు.
అంతేకాదు, మంత్రి అఖిల ప్రియ కూడా తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనీ, ఓ భవన నిర్మాణ విషయమై అనుమతులు దక్కకుండా అఖిల ప్రియ అడ్డుకున్నారంటూ కొన్ని విమర్శలు కూడా ఆ వర్గం నుంచి వినిపిస్తున్నాయి. దీంతో తనను మంత్రితోపాటు, ముఖ్యమంత్రి కూడా పెద్దగా పట్టించుకోవడం లేదని సుబ్బారెడ్డి భావిస్తున్నారట. అందుకే, తన బలాన్ని నిరూపించుకునేందుకు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని టీడీపీ కార్యకర్తలకు భారీ ఎత్తున విందు ఇచ్చేందుకు ఏవీ సుబ్బారెడ్డి సిద్ధమయ్యారు. అయితే, ఈ విందుకు హాజరు కావొద్దు అంటూ కార్యకర్తలకు భూమా అఖిల ప్రియ చెప్పారట! దీంతో ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు మళ్లీ మొదటికి వచ్చాయనే విషయం బహిర్గతమైంది. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో.. ఆళ్లగడ్డలో ఈ రెండు వర్గాల మధ్యా సయోధ్య కుదర్చకపోతే కర్నూలు జిల్లా టీడీపీకి ఇబ్బందే అనే ఆందోళన జిల్లా పార్టీ శ్రేణుల్లో వ్యక్తమౌతోంది.