తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఇప్పుడు.. అధికార బాధ్యతల నుంచి విముక్తి అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తన ఐదేళ్ల పాలనా కాలంలో.. ఆయన ఏపీని ఎంత అభివృద్ధి చేశారో… అక్కడి ప్రజలకు ఎంత సేవ చేశారో కానీ.. పార్టీని పట్టించుకోకుండా… మొత్తానికే తేడా తెచ్చుకున్నారని పలితాలతో తేలిపోయింది. ఇప్పుడైనా చంద్రబాబు… పార్టీపై దృష్టి పెడతారా.. అంటే.. లేదని తేలిపోతోంది. ఆయన ఆలోచనలు.. పాతకాలం రాజకీయ పద్దతుల దగ్గరే ఆగిపోతున్నాయి.
తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు ఎందుకు ఈ దుస్థితికి వచ్చిందంటే… టీడీపీ అధినేత చంద్రబాబు… తెలంగాణ రాజకీయాలపై అత్యధికంగా దృష్టి కేంద్రీకరించడమే. గత ఎన్నికల్లో ఏపీ సీఎంగా గెలిచిన నాటి నుంచి ఆయన తెలంగాణలో పార్టీ బలోపేతానికే ఎక్కువ దృష్టి పెట్టారు. ఫలితంగా.. కేసీఆర్ రాజకీయ వ్యూహంలో చిక్కి… ఏపీకి వెళ్లిపోవాల్సి వచ్చింది. తెలంగాణ టీడీపీని వదిలి పెట్టాల్సి వచ్చింది. ఆ దెబ్బతో… కేసీఆర్. పంజా విసిరి.. అసలు పార్టీని లేకుండా చేశారు. ఆ తర్వతైనా.. ఆయన సైలెంట్‌గా లేరు.. టీడీపీ పునాదుల్ని పెకిలించేశారు. ఇప్పుడు తెలంగాణలో.. టీడీపీకి క్యాడర్ లేదు. వయసయిపోయిన కొంత మంది నేతలు మాత్రం మిగిలారు. ఓ విధంగా టీడీపీ ఏపీలో ఓడిపోవడానికి కూడా ఈ తెలంగాణ రాజకీయాలే కీలకం. అయినా సరే.. చంద్రబాబు తెలంగాణ రాజకీయాలను వదిలి పెట్టబోనంటున్నారు. ఇక నుంచి వారానికి రెండు రోజులు.. కేటాయిస్తానని.. మళ్లీ టీడీపీని పునరుజ్జీవింప చేసుకుందామని అంటున్నారు.
తప్పులను గుర్తించలేకపోతున్నారా..?
చంద్రబాబు.. తాను ముఖ్యమంత్రిగా ఏపీ ప్రజల ఆదరణ ఎందుకు కోల్పోయారో ఇప్పటికీ సరైన రీతిలో అంచనా వేసుకోలేకపోతున్నారు. ప్రజలకు ఎన్నో చేశామని.. కానీ తనకు ఓట్లేయలేదని.. ఆయన బాధపడుతున్నారు. కానీ..తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో.. ఆయన నేర్చుకున్న అంశాలను కలగలిపి.. విశ్లేషణ చేసుకోవడంలో.. ఆయన ఫెయిలవుతున్నారని… పార్టీ నేతలతో ఆయన మాట్లాడేటప్పుడే తెలిసిపోతోంది. అభివృద్ధి నినాదం మీద..ప్రజలు ఓట్లు వేయరని.. ఇప్పటికి ఎన్నో సార్లు రుజువయింది. అంత ఎందుకు.. భారత్ వెలిగిపోతోందంటూ… బీజేపీతో కలిసి ముందస్తు ఎన్నికలకు చంద్రబాబు వెళ్లినప్పుడు ప్రజలు ఓట్లు వేయలేదు. అదే.. అలాంటి అభివృద్ధి నినాదాలేమీ లేకుండా… ఇతర అంశాలతో ప్రజల ముందుకెళ్తే బీజేపీకి మరోసారి ఘన విజయం అందించారు. అదే సమయంలో… అభివృద్ధి, అమరావతి, పోలవరం అంటూ.. చంద్రబాబు ఎంత చెప్పినా… ప్రజలు పట్టించుకోలేదు. ఇప్పుడు రాజకీయం స్టైల్ మారింది. చంద్రబాబు అది ఇంకా అంచనా వేసుకోలేకపోతున్నారు.
ఏదో ఓ రాష్ట్రానికే టీడీపీ పరిమితం కావడం అనివార్యం..!
చంద్రబాబు.. ఇప్పటికీ… టీడీపీని రెండు రాష్ట్రాల్లో ఉంచాలని తాపత్రయ పడుతున్నారు. కానీ.. తెలంగాణ రాజకీయం ఇప్పుడు మారిపోయింది. టీడీపీ ఖాళీ చేసిన తర్వాత ఆ వాక్యూమ్‌ని… హిందూ నినాదంతో బీజేపీ ఆక్రమిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. టీడీపీకి అంత కంటే బలమైన నినాదం కావాలి. అది లేదు. రాదు కూడా. తెలంగాణలో.. టీడీపీకి.. చంద్రబాబుకు వ్యతిరేకంగా బలబమైన అభిప్రాయాన్ని ప్రజల మనసుల్లో పాతడంలో టీఆర్ఎస్ సక్సెస్ అయింది. అందువల్ల టీడీపీ.. ఏదో ఓ రాష్ట్రానికే పరిమితం కావాల్సిన అనివార్యత ఏర్పడింది. అది కూడా ఏపీకి మాత్రమే చాన్స్ ఉంది. ఈ అనివార్యతను చంద్రబాబు అర్థం చేసుకోలేకపోతున్నారు. తెలంగాణపైనా దృష్టి పెడుతున్నారు. దాంతో ఏపీలో టీడీపీకి ఇబ్బంది తెచ్చి పెడుతున్నారు.
వయసు పెరిగే కొద్దీ… ఆలోచనల్లో ఉన్నతం వస్తుంది. అది సహజం కూడా. కానీ రాజకీయాల్లో… వయసు, అనుభవం పెరిగేకొద్దీ.. కురచతనం రావాలి. అప్పుడే… సక్సెస్ అవుతారు. దేశంలో ఇప్పుడు గొప్ప విజయాలు సాధించిన రాజకీయ నేతలందరూ.. అలానే చేస్తున్నారు. వయసుతో పాటు హుందాతనం పెరిగితే.. ఔట్ డేటెడ్ పొలిటిషియన్ అంటున్నారు. చంద్రబాబునూ అలాగే అంటున్నారు. ఎంత మార్చుకుంటే.. అంత మంచిది. లేకపోతే ఆ పేరే స్థిరపడిపోతుంది.