ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర ప్రదేశ్‌కు పెట్టుబడులను తెచ్చే మరొక మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఆయన ఐటీ అభివృద్ధికి చేసిన కృషి అనిర్వచనీయం. దాని వెనుక ఉన్న స్వార్థాలు, ప్రయోజనాలు, భూకుంభకోణాలు పక్కన పెడితే.. ఏపీకి విశ్వవ్యాప్త గుర్తింపును తెచ్చిపెట్టిందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కొత్త రాష్ట్రం తెలంగాణ నేడు దేశంలో సంపన్న రాష్ట్రంగా నిలవడానికి నాటి చంద్రబాబు కృషే కారణం. ఏటా లక్షలాది కోట్ల రూపాయల ఐటీ ఉత్పత్తులు హైదరబాద్‌కు తిరుగులేని శక్తిని అందించాయి. అమెరికా అధ్యక్షుణ్ణి సైతం హైదరాబాద్‌కు రప్పించిన ఘనతనూ ఆయన సొంతం చేసుకున్నారు. మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీల అధినేతలు సైతం వరుస కట్టారు.
ఇప్పుడు నవ్యాంధ్ర ప్రదేశ్‌ను హైదరాబాద్ స్థాయిలో నిలబెట్టేందుకు చంద్రబాబు పునాది వేస్తున్నారు. కొత్త రాష్ట్రంలో ఆయన చేస్తున్న పనులు అక్కడక్కడా విమర్శలకు చోటిస్తున్నప్పటికీ పట్టించుకోకుండా తన పని తాను చేస్తున్నారు. అభివృద్ధికి ఇది మొట్టమొదటి సూత్రం. విమర్శలను పట్టించుకోకుండా తాననుకున్నది చేయడమే ఆ సూత్రం. రాష్ట్రం విడిపోనప్పుడు చంద్రబాబుకు అప్రతిహతమైన, అపరిమి..తమైన అధికారాలున్నాయి.. అందుబాటులో నిధులూ ఉన్నాయి. ఇప్పుడు అధికారాలున్నా చాలినన్ని నిధుల్లేవు. వాటిని సంబాళించుకుంటూ సాగాల్సిన అవసరాన్ని చంద్రబాబు విస్మరిస్తున్నారేమోనని అనిపిస్తుంటూంది కొన్ని పర్యటనల అనుభవాలు తెలుపుతున్నాయి. వాటిని అధిగమించేలా తాజా పర్యటన రూపుదిద్దుకుందనిపిస్తోంది.
మే నాలుగో తేదీన బయలుదేరి, 11వ తేదీ వరకూ అమెరికాలో పర్యటిస్తారు. ప్రవాస భారతీయులు, ప్రవాసాంధ్రులు, అమెరికా పారిశ్రామికవేత్తలతోనూ సమావేశమై నవ్యాంధ్రకు పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు చంద్రబాబు. ట్రాన్ఫర్మేటివ్ సీఎం అవార్డును అందుకోబోతున్నారు. యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఈ అవార్డును అందిస్తోంది. యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్‌కు చెందిన వెస్ట్‌కోస్ట్ యాన్యువల్ సమిట్‌లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. కాలిఫోర్నియా, అయోవా, ఇలినాయిస్లతో అవగాహన ఒప్పందాలను చేసుకుంటారు. ఫిన్‌టెక్ రంగంలో ఇలినాయిస్, టెక్నాలజీలో కాలిఫోర్నియా, వ్యవసాయంలో అయోవా అగ్రగాములు. వీటితో కుదుర్చుకునే సోదరపూర్వక ఒప్పందాలు ఏపీ సర్వతోముఖాభివృద్ధికి రాచబాటలు వేస్తాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు. మొత్తం 300మంది సీఈవోలతో చంద్రబాబు సమావేశమవుతారు. కొన్ని బృంద సమావేశాల్లోనూ, ద్వైపాక్షిక సమావేశాల్లోనూ ఆయన పాల్గొంటారు. యాపిల్, టెస్లా, సిస్కో, ఒరాకిల్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలను సందర్శిస్తారు. ఫ్లెక్స్ ట్రానిక్స్ సీఈఓ మైక్‌మెక్ నమరా, ఒరాకిల్ గ్లోబల్ సీఈఓ స్ఫ్రా కార్జ్లతో భేటీ అవుతారు. అన్నింటికంటే మే నెల 8న చంద్రబాబు పాల్గొనే సమావేశం అత్యంత కీలకమైనది. సిస్కో సీఈఓ జాన్ చాంబర్స్ నిర్వహించే ఈ సమావేశంలో సుందర్ పిచాయ్, టిమ్ కుక్, షెర్లీ శాండ్ బగ్, లారీ ఇలిసన్ వంటి ముఖ్యులు ఇందులో పాల్గొంటున్నారు.
చూసేందుకు అత్యంత ప్రభావవంతంగా ఉన్న ఈ అమెరికా టూర్ ఆంధ్ర ప్రదేశ్‌కు కొత్త సొబగులను అద్దుతుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ప్రతిపక్షం రంధ్రాన్వేషణ చేయడానికి ఎటూ ఉండనే ఉంది. ఒక రకంగా ఆ రకమైన అన్వేషణలే చంద్రబాబు ప్రభుత్వానికి చుక్కలు చూపించినా… తప్పులను సరిదిద్దుకోవడానికి ఉపయోగిస్తున్నాయి. ఏపీకి జవజీవాలను తెచ్చిపెట్టే చంద్రబాబు తాజా విదేశీ పర్యటన విజయవంతంగా సాగాలని కోరుకుందాం.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి