చంద్రబాబు నాయుడు చిన్న వయసులోనే మంత్రి అయ్యారు.మామ ఎన్టీఆర్‌పై తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. 1999లో వాజ్‌పేయితో కలసి మరోసారి గెలిచారు.తర్వాత రెండు సార్లు ఓడిపోయినా ప్రతిపక్ష నేతగా వున్నారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. జాతీయ రాజకీయాలలోనూ ఒక ముఖ్యపాత్ర పోషించారు. ఇవన్నీ నిజమే గాని వీటిని బట్టి తనది తిరుగులేని రికార్డు అని చెప్పుకోవడంలో వాస్తవికత వుందా? రాజకీయాలలో 1+1= 2 కాదని 2-1=1 కాదని అంటుంటారు. బిట్వీన్ ద లైన్స్ చూడాలి. 30 ఇయర్స్ ఇండిస్టీ ఇక్కడ అన్నట్టు సంవత్సరాల లెక్క ఒక్కటే చాలదు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఎందరో నేతలు చంద్రబాబు కన్నా మహత్తర శిఖరాలు ఆరోహించారనేది మర్చిపోవడం నమ్రత కాదు. అంతర్గత కారణాల వల్ల లేదా ఆత్మ విశ్వాసం వల్ల వారు కేంద్రానికి వెళ్లి రాణించారు. ఉదాహరణకు నీలం సంజీవరెడ్డి శక్తివంతమైన ముఖ్యమంత్రిగా పనిచేయడమే గాక కేంద్రంలో మంత్రిగా స్పీకర్‌గా పనిచేసి తర్వాత ఏకంగా దేశానికి రాష్ట్రపతి అయ్యారు. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు తదితరులు కమ్యూనిస్టు ఉద్యమంలో జాతీయ నేతలైనారు.పివి నరసింహారావు రాజీవ్ మరణానంతర పరిస్థితులలో ఏకంగా ప్రధాని అయ్యారు. సంజీవయ్య తదితరులు కాంగ్రెస్ జాతీయ అద్యక్షులయ్యారు.ఎన్టీఆర్ స్వంతంగా పార్టీ పెట్టి తొమ్మిదినెలల్లో అధికారంలోకి రావడమే గాక నేషనల్ ఫ్రంట్ అద్యక్షుడైనారు. కోట్ల విజయభాస్కర రెడ్డి,జలగం వెంగళరావు, కాసు బ్రహ్మానందరెడ్డి వంటివారంతా కేంద్రంలోనూ దీర్ఘకాలం పనిచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిపక్షంలో వుండి పోరాడి చంద్రబాబును ఓడించడమే గాక కాంగ్రెస్ వంటిపార్టీలో తనకంటూ ఒక పునాది ఏర్పర్చుకోగలిగారు. ఆయన నాయకత్వంలోనే కాంగ్రెస్ రెండవ సారి విజయం సాధించగలిగింది. పదవీ కాలం పూర్తిచేసిన ఏకైక ముఖ్యమంత్రిని తానేనని ఆయన అంటుండేవారు. రెండవ సారి ప్రమాదంలో చనిపోకపోతే ఆయన పదవీ కాలం చంద్రబాబును దాటిపోయేది. ప్రజలే హైకమాండ్ అంటున్న ఆయన ఎన్టీఆఱ్లా కేంద్రంతో ఘర్షణ పడటానికి సిద్ధమవడం లేదు. బిజెపి ప్రధాని అయినా మోడీతో ఘర్షణ పడటానికి విమర్శించడానికి సిద్ధమవడం లేదు.ఆ విధంగా చూస్తే మోడీ హైకమాండ్ కంటే ఎక్కువ పెత్తనం చేస్తున్నారు.కాబట్టి చంద్రబాబు తను దీర్ఘకాలం వుండటం గురించి చెప్పుకోవచ్చు గాని అదే అపురూపమని అనితర సాధ్యమని అతిశయాలు పలకడం అనవసరం. ప్రధానిని రాష్ట్రపతిని తానే ప్రకటించానంటున్న చంద్రబాబు తనను పైకి ఎత్తిపట్టుకున్న హరికిషన్ సింగ్ సూర్జిత్, విపిసింగ్ వంటివారిని మర్చిపోతున్నారు. వారు లేకుంటే ఆయనకు ఇంత ప్రాధాన్యత వచ్చేదే కాదు. సో లిటిల్ రియాల్టి ప్లీజ్