తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు 72వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. దేశ రాజకీయాల్లో ఉన్న సీనియర్ లీడర్లలో ఆయన ఒకరు. 28 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ఒక్క టెర్మ్ మాత్రమే ప్రజాప్రతినిధిగా లేరు. తన ప్రజా జీవితం అంతా అత్యధిక కాలం ముఖ్యమంత్రిగానో.. ప్రతిపక్ష నేతగానో ఉంటూ వస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన ఆయనది అభివృద్ధి బ్రాండ్. రాజకీయ ప్రత్యర్థులు సైతం దీన్ని అంగీకరిస్తారు. హైదరాబాద్ పురోగతికి చంద్రబాబు చేసిన కృషిని ఎవరూ మర్చిపోలేరు.
ఇప్పుడు అమరావతి కోసం ఆయన వేసిన ప్రణాళికలు ఆర్థిక వేత్తల్ని మెప్పించాయి కానీ.. రాజకీయ కక్షలు.. కుట్రల్లో ఇరుక్కుపోయాయి. అయినా ఎప్పుడు పట్టాలెక్కినా అమరావతి ఓడ్రీమ్ ప్రాజెక్ట్ అవుతుందని అందరికీ ఓ నమ్మకం ఉంది. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే అభివృద్ధి అని గట్టిగా నమ్మిన నేత చంద్రబాబు. ఓ పదివేలు ఓ కుటుంబానికిఇవ్వడం కాదు.. ఆ పదివేలు ప్రతీ నెలా సంపాదించుకునేలా ఉపాధి చూపించడం అభివృద్ధి అని నమ్మారు. ఆ దిశగా పాలన సాగించారు. ప్రజల జీవ ప్రమాణాలు పెంచారు. ఈ విషయంలో ఆయన పాలన తప్పులెన్నలేనిది.
అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఆయన వర్కింగ్ స్టైల్ ఒక్కటే. దాంట్లో మార్పు రాదు. పార్టీ కోసం.. రాష్ట్రం కోసం ఆయన నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ఓ పదేళ్లు ముందుగా ఆలోచించే ఆయన దార్శనికత ఇప్పటికే రాష్ట్రానికి ఎంతో మేలు చేసింది. ఆయనకు విద్వేష రాజకీయాలు తెలియవు. కులం, మతం, ప్రాంతం పేరుతో జనాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు తెలియవు. ఇప్పుడు వాటిదే కాలం. ఆయన కులం ముద్ర వేసి చేసే రాజకీయాలు మాత్రమే ఇతర పార్టీలు చేయగలవు. అభివృద్ధిలో పోటీ పడలేవు.
అప్పటి వరకూ ఉన్న పాలకులు ఏ అభివృద్ది చేయలేదు. చంద్రబాబు వచ్చిన తర్వాత అభివృద్ధిని ఏపీ చూసింది. అదే విభజనకు కారణం అయిందంటూ కొంత మంది వితండవాదనతో అసలు అభివృద్ది చేయకూడదని వాదిస్తున్నారు. చంద్రబాబు అభివృద్ధి చేస్తే మళ్లీ విభజన వస్తుందని … తెలివితేటల్ని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి రాజకీయంలో ఇప్పుడు చంద్రబాబు మళ్లీ విభజిత రాష్ట్రానికి ఓ దశ.. దిశ తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ప్రయత్నాలు ఫలించాలని కోరుకుందాం.. హ్యాపీ బర్త్ డే !