ప్రజల జీవితాలను మార్చే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఫోటో ఉండేలా చూసుకోవాల్సిన పని లేదు… కానీ ప్రతి కుటుంబం ఎదుగుదలలో ముద్ర ఉంటేలా చేస్తే మాత్రం జీవితంలో అనుకున్న లక్ష్యం సాధించినట్లే. తెలుగుదేశం పార్టీ అధినేత , ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఘనత సాధించారు. పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన పనులు సంస్కరణల వల్ల ప్రతి కుటుంబమూ ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు అవకాశాలు పొందింది. కొంత మంది ఆ అవకాశాల్ని ఉపయోగించుకుని ఓ మెట్టు పైకి ఎదిగి ఉండవచ్చు..కొంత మంది నేలపాలు చేసుకుని ఉండవచ్చు.. కానీ చంద్రబాబు ప్రయత్నాలు మాత్రం విఫలం కాలేదు.
చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితులు నేటి తరానికి తెలియవు. అప్పట్లో అభివృద్ధి అనేది ద్వితీయ ప్రాధాన్య అంశం. ఉపాధి అవకాశాల గురించి ఆలోచించే నేతలు ఉండేవారు కాదు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశ రాజకీయ దృక్కోణం మారిపోయింది. యువతకు ఉపాధి అందించడానికి ఆయన సాహసం చేశారు. విపక్షాలు తప్పుడు ప్రచారం చేశాయి. రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా ప్రజలు బాగుపడితే తనకు జరిగే నష్టం పెద్ద నష్టం కాదని ముందుకే వెళ్లారు. ఇంజనీరింగ్ విద్య నుంచి ఐటీ ఉద్యోగాల వరకూ.. వివిధ రంగాల్లో స్వయం ఉపాధి పొందే యువతకు సాయం వరకూ చంద్రబాబు ముద్ర అనన్య సామాన్యం.
ఆకలైతే అన్నం పెట్టేవాడు లీడర్ కాదు.. ఆ అన్నం ఎలా సంపాదించుకోవాలో నేర్పేవాడు అసలైన లీడర్. ఒక్క సారి నేర్పితే జీవితాంతం సంపాదించుకుని తింటాడు. ఏ పనీ చేసుకోలని వాళ్లకు రోజూ కడుపు నింపే సంక్షేమం ఉండాలి. ఈ సిద్ధాంతాన్ని చంద్రబాబు నమ్మారు. 28 ఏళ్ల వయసులో చంద్రబాబు రాజకీయం ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకూ ఆయన ఎన్నికల్లో ఓడిపోయి ఉండవచ్చు కానీ.. రాజకీయంగా మాత్రం ఎదుగుతూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్లో ఆయన తెచ్చిన మార్పే ఈ ఎదుగుదలకు కారణం.
రాజకీయాల్లో అజాతశత్రువులు అంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా ప్రధాన పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే.. మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మంచి చేసినా.. చెడు చేసినా.. చెడుగానే ప్రచారం చేస్తారు. బయట ప్రపంచం అంతా ఆయనను ఆరాధిస్తుంది. కానీ సొంత రాష్ట్రంలో అంత ఏకపక్ష మద్దతు ఉండదు. ఎన్టీఆర్కే ఇలాంటి పరిస్థితి తప్పలేదు. చంద్రబాబుకు కూడా అంతే. ఆయనను రాజకీయంగా కుల, మత, ప్రాంతం కారణంగా విబేధించేవారు ఉంటారు కానీ.. పనితీరు పరంగా ఎవరూ విమర్శించలేరు.
చంద్రబాబు జీవితం తెరిచిన పుస్తకం. ఆయన కెరీర్ ప్రారంభించినప్పుడు పుట్టిన వాళ్లు ఇప్పుడు జీవితాల్లో స్థిరపడిపోయి.. పిల్లల ఎదుగుదలను చూస్తూంటారు. కానీ ఆ పిల్లలకు చంద్రబాబు గురించి పూర్తిగా తెలియకపోవచ్చు. సోషల్ మీడియా యుగంలో చంద్రబాబు చేసిన పనులేమిటో వారికి చెప్పడం కూడా కష్టమే. ఎందుకంటే ఒకరి ఘనతను తమ ఘనతే అని చెప్పుకునేవారి సంఖ్య.. పెరిగిపోతోంది. కానీ కొత్త తరానికి చంద్రబాబు అంటే ఏమిటో.. ఆయన అరెస్టు సమయంలో తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకున్నారు. దటీజ్ చంద్రబాబు అని.
చంద్రబాబు మా రాష్ట్రానికి సీఎం అయి ఉంటే ఈ పాటికి చైనాతో పోటీపడే ఎకానమీని సాధించేవాళ్లం అని ఇతర రాష్ట్రాల ప్రజలు అనుకుంటూ ఉంటారు. చంద్రబాబు 2004లో ఓడిపోకపోతే.. 2019లో ఓడిపోకపోతే అన్న భావన వచ్చినప్పుడు ఆంధ్రుడికీ అదే అభిప్రాయం వస్తుంది. తన పనితీరుపై ప్రజల్లో అలాంటి ముద్ర వేశారు చంద్రబాబు.
పనిలోనే విశ్రాంతి వెదుక్కునే అవిశ్రాంత అభివృద్ధి రుషికి 75వ జన్మదిన శుభాకాంక్షలు.