కృష్ణా పుష్కరాల సందర్భంగా ఏపి సిఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో ఏర్పాటు చేసిన ఒక సదస్సులో మాట్లాడుతూ, జనాలు, జలాలు తన బలాలని చెప్పారు. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకున్న అన్ని నదులు, వాగులు, వంకలు అన్నిటినీ అనుసంధానం చేసి రాష్ట్రాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దుతానని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాధాన్యతా క్రమంలో 8 ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేస్తోందని చెప్పారు. వాటిలో పోలవరం మొదటిదశ నిర్మాణ పనులని పూర్తి చేయడం కూడా ఒకటని తెలిపారు. ఈ పనుల కోసం చాలా సంస్థలని ఏర్పాటు చేశామని అవన్నీ తమ పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో నదుల అనుసంధానం, జలవనరుల వినియోగంపై యూనివర్సిటీ, కళాశాల స్థాయిలో కూడా చర్చలు జరిపించి, వాటిలో వచ్చే మంచి సూచనలు, సలహాలని తమ ప్రభుత్వం స్వీకరించి అమలుచేయాలనుకొంటున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో ఉన్న నీటి వనరులని ఆడిట్ చేసి వాటిని మరింత అభివృద్ధి పరిచి సమర్ధంగా వినియోగించుకొని ఫలితాలు రాబట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఆధునిక టెక్నాలజీ సహాయంతో నదుల అనుసంధానం ప్రక్రియని పూర్తి చేస్తామని తెలిపారు. కానీ రాష్ట్రంలో కొందరు తమ అభివృద్ధి పనులకి అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తూ పనులని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్, వైకాపాలని ఉద్దేశ్యించి అన్నారు. రాజధాని నిర్మాణం పూర్తి కావడానికి సుమారు 15ఏళ్ళు పట్టవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు.
ముఖ్యమంత్రి నదుల అనుసంధానం గురించి చాలా కాలంగా చెపుతున్నప్పటికీ, దాని కోసం ప్రభుత్వం ఏమేమి ప్రణాళికలు సిద్దం చేస్తోందో, ఏవిధంగా ముందుకు వెళ్ళాలనుకొంటోందో, దానిలో సాధ్యాసాధ్యాల గురించి ఆయన కానీ మంత్రులు గానీ చివరికి తెదేపా నేతలు గానీ ప్రజలకి వివరించేప్రయత్నం చేయకపోవడంతో, ప్రభుత్వ ఆలోచనలు ప్రజలకి చేరకుండా దాని వద్దనే ఉండిపోయాయి. దాని వలన నదుల అనుసంధానం అంటే పట్టిసీమ మాత్రమే అనే భావన ప్రజలలో ఏర్పడింది. దానిపై వచ్చిన అవినీతి ఆరోపణలు, అ కారణంగా అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాల కారణంగా ప్రజలలో కూడా చాలా అపోహలు కూడా ఏర్పడ్డాయి.
ఇప్పుడు నదుల అనుసంధానం గురించి ముఖ్యమంత్రి కొంత స్పష్టత ఇచ్చినప్పటికీ, ఈ విషయంలో ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి ప్రజలకి ఇంకా వివరించవలసింది చాలానే ఉందని అర్ధం అవుతోంది. రాజధాని నిర్మాణం పూర్తి కావడానికి మరో 15-20 ఏళ్ళు సమయం పడుతుందని అందరికీ తెలిసిన విషయమే. కానీ వచ్చే ఎన్నికలలోగా అమరావతికి కనీస రూపురేఖలు వస్తాయని ప్రజలు ఆశగా ఎదురుచూస్తునందున, ఆలోగా రాజధాని నిర్మాణ పనులు ఎంతవరకు పూర్తయ్యే అవకాశం ఉందో ముఖ్యమంత్రి వివరించి ఉంటే బాగుండేది.