స్టీల్ ప్లాంట్ కేంద్రం పెట్టకపోతే.. ఏపీనే పెడుతుందని.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. నెలలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. ప్రధానమంత్రి మోదీ నమ్మించి మోసం చేశారని.. చంద్రబాబు మండిపడ్డారు. విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై జరిగిన దాడి ఘటనలో తనపై వైసీపీ నేతలు ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. తాను హత్యలు చేయించేవాడినా అని మండిపడ్డారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన ధర్మపోరాట సభలో… కడప స్టీల్ ప్లాంట్ పై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. కడపలో స్టీల్‌ప్లాంట్ వచ్చి తీరుతుందన్నారు. న్యాయంగా..బాధ్యతగా కేంద్రం ముందుకు రాకపోతే… గురువారం జరిగే కేబినెట్ భేటీలో స్టీల్‌ప్లాంట్‌కు క్లియరెన్స్ ఇస్తామని ప్రకటించారు. ఉక్కు పరిశ్రమ కడప హక్కన్నారు. ఉక్క పరిశ్రమతో రాయలసీమ రూపురేఖలను మారుస్తామన్నారు. నెల రోజుల్లో స్టీల్‌ప్లాంట్‌కు పునాది రాయి వేస్తామని ప్రకటించారు. కడప జిల్లాలో వైసీపీ నాయకుడు ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. ఇలాంటి నాయకుడి వల్ల కడప జిల్లాకు నష్టమన్నారు. మోదీని వైసీపీ నాయకులు, పవన్‌కల్యాణ్ ఒక్క మాట అనరు ఇది లూలూచీ రాజకీయం కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు.
విశాఖ విమానాశ్రయంలో.. జగన్ పై జరిగిన దాడి ఘటన గురించి చంద్రబాబు స్పందించారు. తనపై ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. కేంద్రం ఆధీనంలో ఉండే ఎయిర్‌పోర్టులో ఘటన జరిగిందని.. వైసీపీ వీరాభిమానే జగన్‌పై దాడి చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. కోడికత్తి డ్రామాలో నిజాలు ప్రజలకు తెలియాలన్నారు. హత్యలు చేయించేవాడినా? .. ఎప్పుడైనా నేరాలు చేశానా? అని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ పడలేదు … చిల్లర రాజకీయాలు చేయవద్దని కేంద్రాన్ని హెచ్చరించారు. విశాఖలో జగన్‌పై దాడి ఘటనతో … ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని ఆందోళనకు గురయ్యానన్నారు. ఆ సమయంలో జగన్‌తో మాట్లాడాలనుకున్నానని అయితే వైసీపీ నేతలు తననే ఏ-1 నిందితుడినని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. తనపై దాడి జరిగితే ప్రత్యర్థులపై ఎప్పుడైనా విమర్శలు చేశానా? అని ప్రశ్నించారు. హత్యా రాజకీయాలు చేయను..రాజకీయంగా పోరాడుతానన్నారు.
కేంద్రం చేస్తున్నది నమ్మక ద్రోహం చేసిందని… ప్రశ్నిస్తే.. ఐటీ దాడుల పేరుతో బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు సభ కేంద్రంపై పోరాటానికి శంఖారావంగా తేల్చి చెప్పారు. టీడీపీ నాయకుల ఇళ్లన్నీ సోదాలు చేయండి .. నిలదీస్తూనే ఉంటానని కేంద్రాన్ని హెచ్చరించారు. దేశం కోసం.. పోరాడుతున్నామనన్నారు. ఢిల్లీ పర్యటనలో.. కేంద్రానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పోరాడుతానని ప్రకటించిన చంద్రబాబు దానికి అనుగణంగా.. ప్రొద్దుటూరులో కార్యాచరణ ప్రకటించారు. ఇతర రాష్ట్రాల్లోనూ తన పోరాటం ఉంటుందని నేరుగా చెప్పేశారు.