ఆరేడుగురు ఎమ్మెల్యేల్ని లాగేసుకుని… చంద్రబాబు ప్రతిపక్ష హోదాను.. క్యాన్సిల్ చేయాలని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది. రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని ధీమాగా చెబుతున్నారు. ఇప్పటికే .. ఒక వికెట్ వల్లభనేని వంశీ రూపంలో డౌన్ అయింది. మరో వికెట్ గంటా శ్రీనివాసరావు రూపంలో.. రెడీగా ఉంది. అయితే.. ఈయన బీజేపీ వైపు చూస్తున్నారు. టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. మరో ఐదుగురిపై.. వైసీపీ గురి పెట్టి.. వ్యాపారాలు.. అవసరాలను… లెక్క తీస్తోందని… వారు కూడా లైన్లోకి వస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో… చంద్రబాబునాయుడు.. మీడియా ప్రతినిధుల ముందు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తనకు ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలనుకుంటున్నారని..అది వారి భ్రమ.. అని తేల్చి చెప్పారు. ఒక్క ఎమ్మెల్యేను బెదిరించి .. పార్టీలో చేర్చుకున్నంత మాత్రాన.. ఆందోళన చెందడానికి ఏముందంటున్నారు. ఇల్లు అలకగానే పండగకాదని.. ..వీరు హోదా ఇస్తేనే వచ్చిందా…అని ప్రశ్నించారు. ప్రజలు ఇస్తేనే వచ్చిందన్నారు. ప్రజలు ఇచ్చిన హోదాను కాపాడుకోవడం నాకు తెలీదా.. అని మీడియా ప్రతినిధుల్ని ప్రశ్నించారు. వాస్తవానికి ప్రతిపక్ష నేత.. అనే గుర్తింపు అసెంబ్లీ రికార్డుల్లో మాత్రమే ఉంటుంది. ప్రభుత్వాన్ని వ్యతిరేకించేవారంతా ప్రతిపక్ష నేతలే. ప్రధాన ప్రతిపక్ష నేతకు.. అసెంబ్లీలో గుర్తింపు ఉంటుంది. అసెంబ్లీలో టీడీపీ తప్ప మరో పార్టీ లేదు కాబట్టి.. ఎంత మంది ఎమ్మెల్యేలున్నా.. ప్రతిపక్ష హోదా ఉంటుంది.
అయితే.. చంద్రబాబు.. తాను పధ్నాలుగేళ్లు సీఎంగా చేశానని.. పదేళ్లు ప్రతిపక్ష నేతగా పని చేశానని.. తన రాజకీయ జీవితంలో… అయితే… సీఎం..లేకపోతే ప్రతిపక్ష నేతగానే ఎక్కువ కాలం ఉన్నానని.. తనకు ఇంక రాజకీయ పదవులపై ఆశ ఏముంటుందని ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ మాటలే వైసీపీ పెద్దలకు రుచించడం లేదు. ఆయనకు ప్రతిపక్ష హోదాను దూరం చేయాలన్న పట్టుదలతో ఉన్నారంటున్నారు. దాన్ని ఎలా కాపాడుకోవాలో.. తనకు తెలుసని.. చంద్రబాబు అంటున్నారు. మొత్తానికి.. ఏపీ రాజకీయాల్లో ఇలా కొత్త రేస్ ప్రారంభమయిందని అనుకోవచ్చు.