నెల్లూరు జిల్లాలో ఓ దళిత రైతు.. తన భూమిని బలవంతంగా లాక్కుంటున్నారన్న ఆవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల జరుగుతున్నాయి. అయితే.. నెల్లూరులో జరిగిన ఘటన మాత్రం.. అంతకు భిన్నమైనది. ఆ రైతు.. అప్పటికే తన భూమిని తీసుకోకుండా.. హైకోర్టుకు వెళ్లి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. పొలంలో పని చేసుకుంటున్నారు. అయినప్పటికీ.. రెవిన్యూ అధికారులు.. పోలీసులను తీసుకుని వచ్చి వేధించారు. తిట్టారు.. దాడికి ప్రయత్నించారు. దాంతో.. పొలంలో చల్లేందుకు తెచ్చుకున్న పురుగుల మమందును అక్కడే తాగేశారు. ఆ రైతు పురుగుల మందు తాగడాన్ని అక్కడే ఉన్న పోలీసులు చూస్తున్నారు. అలా… చిద్విలాసంగా వారు చూస్తూనే ఉన్నారు కానీ… పట్టించుకోలేదు. దాంతో.. ఆ రైతు పురుగుల మందు తాగి.. అక్కడికక్కడే చనిపోయాడు. ఈ దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి.
వెంకటయ్య అనే రైతు వెంకన్నపాలెం అనే గ్రామానికి చెందిన వారు. ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చిన అసైన్డ్ ల్యాండ్‌ను సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం అందులో పంట ఉంది. అయినా దున్నేసి.. ఇళ్ల స్థలాలుగా మార్చాలని అధికారులు ప్రయత్నించారు. దీనిపైనే ఆయన కోర్టుకు వెళ్లి… అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కానీ అధికారులు.. పోలీసులు ఆ ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోలేదు. రైతును వేధించడం ప్రారంభించారు. ఆ వేధింపులు ఆత్మహత్యకు కారణం అయ్యాయి. తమకు వ్యతిరేకంగా.. కోర్టుకు వెళ్లారన్న కారణంగానే ఆ బీద దళిత రైతుపై ప్రభుత్వం పగబట్టిందని.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. ఈ ఘటనను ట్వీట్ చేస్తూ మండిపడ్డారు.
ఈ ఘటన కలకలం రేపుతోంది. హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా వేధించడం ఒకటి అయితే… అసలు ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి.. ప్రాణాపాయంలో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నించడం … కనీసం మానవత్వం. అలాంటి ప్రయత్నమే పోలీసులు చేయకుండా.. అలా నిలబడి చూస్తూ ఉండిపోయారు. గతంలో.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు.. గుంటూరు జిల్లాలో ఓ కార్యక్రమంలో సీఎం పాల్గొన్న సమయంలో.. అక్కడ రైతు పురుగు మందు తాగారు. ఆయనను కాపాడేందుకు పోలీసులు పరుగులు పెట్టారు. ఆయనను భుజానపై వేసుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇప్పుడు మాత్రం వారిలో స్పందన కూడా కరవైంది. ప్రాణం పోతూంటే.. అలా చూస్తూండిపోయారు.