పుంగనూరు కాలువ ద్వారా చిత్తూరు జిల్లాకు నీటిని విడుదల చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. చర్లోపల్లి రిజర్వాయర్ దగ్గర కృష్ణా జలాలకు హారతి ఇచ్చారు. తరువాత జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. విభజన తరువాత రాజధాని లేదు, ఆదాయం లేదు, చివరికి పెన్షన్లు కూడా సరిగా ఇవ్వగలనా లేదానే భయపడ్డ పరిస్థితి, మరోపక్క కేంద్రం సహకరించడం లేదు… కానీ, ఎన్ని కష్టాలూ ఇబ్బందులూ ఉన్నా ఎవ్వరికీ ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతోనే కష్టపడి పనిచేశామన్నారు. ఈరోజు అనంతపురం జిల్లా నుంచి కియా కారు తయారై రోడ్ల మీదికి వచ్చిందని ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇదొక చరిత్ర అన్నారు. కాంగ్రెస్ ,వైకాపా నేతలకు సవాలు చేస్తున్నాననీ… గతంలో వారి హయాంలో ఎప్పుడైనా ఇంతటి పెద్ద పరిశ్రమ వచ్చిందా చెప్పాలన్నారు సీఎం.
ఇక్కడే లేపాక్షి ఎస్.ఇ.జెడ్. పెడతామని గతంలో చెప్పారనీ, కానీ ఆ తరువాత అది పోవడంతోపాటు అందరూ జైలుకుపోయే పరిస్థితి వచ్చిందన్నారు. పుట్టపర్తి ప్రాంతంలోనే నాలెడ్జ్ పార్క్ అన్నారనీ, ఎక్కడైనా కనిపించిందా తమ్ముళ్లూ అని అడిగారు. వీరు పట్టిసీమకు అడ్డుపడ్డారనీ, పోలవరం పనులకు కూడా అడ్డుపడుతున్నారనీ, కేసులు వేసి కోర్టులకు వెళ్లి పక్క రాష్ట్రాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ‘మీరు జలదీక్షలు చేయడం కాదు. ఇక్కడికి వచ్చి కృష్ణా జలాల్లో స్నానం చేసి మీ పాపాలు కడుక్కోవాలని ’ ప్రతిపక్ష నేతను ఉద్దేశించి చంద్రబాబు విమర్శించారు. మాటలు చెప్పడం చాలా సులభమనీ, విమర్శలు చేయడం ఇంకా తేలికనీ, పనులు చేసి నిరూపించుకోవడమే నిజమైన నాయకత్వమని చంద్రబాబు చెప్పారు. అనంతపురంలో వర్షం పాతం తగ్గిపోయిందనీ, రానురానూ ఎడారిగా మారే పరిస్థితి ఉందనీ, ఆ పరిస్థితిని మార్చాలన్న సంకల్పంతోనే ఇవాళ్ల నీళ్లు తీసుకొచ్చామని చంద్రబాబు అన్నారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తానని చెప్పారు.
రూ. 12 వేల కోట్ల ఖర్చుతో హంద్రీనీవా పనులు చేశామనీ, పుంగనూరు కాలువ ద్వారా చిత్తూరు జిల్లాకు నీటిని తీసుకెళ్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు. శ్రీకాకుళం మొదలుకొని… వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, పెన్నా నదులన్నీ అనుసంధానం చేసే బాధ్యత తనదన్నారు. ఎన్టీ రామారావు ప్రారంభించిన ప్రాజెక్టులను, తాను ప్రారంభించిన ప్రాజెక్టులన్నింటినీ కలిపి పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది అని చెప్పారు. ఒకే రోజున కియా సంస్థ కారు రోడ్డు మీదికి రావడం, హంద్రీనీవా జలాలు చిత్తూరుకి వెళ్లడం.. అంటే, పరిశ్రమలు, వ్యవసాయం… రెండింటికీ టీడీపీ ప్రభుత్వం సమాన స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పడానికి ఇవి చాలు.