మరో వారం పదిరోజుల్లో తెలుగుదేశం పార్టీలోకి చేరికలు ఉండబోతున్నాయా..? కొంతమంది కీలక మాజీ నేతలకు పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అయిందా…? అంటే, అవుననే అంటున్నాయి అధికార పార్టీ వర్గాలు. ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలో ఇప్పటికే ఎవరికి సీట్లు ఇవ్వాలనే కసరత్తు మొదలైంది. దీంతోపాటు, ఏయే నియోజక వర్గాల్లో పార్టీకి బలమైన అభ్యర్థులు అవసరం..? ఎవరిని చేర్చుకుంటే పార్టీ మరింత బలోపేతం అవుతుందనే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది ప్రముఖ నేతలు టీడీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి నుంచి పార్టీ కార్యకలాపాలపై చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తారని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
ఇక, టీడీపీలో చేరికకు లైన్ క్లియర్ అయిందనే ప్రచారంలో ఉన్న నేతలు ఎవరంటే… మాజీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి, మాజీ మంత్రి అహ్మదుల్లా, ఇటీవలే వైకాపా నుంచి బయటకి వచ్చిన ఆదిశేషగిరిరావులు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరి చేరికకు సంబంధించి చంద్రబాబు కూడా ఓకే అన్నారనీ, సంక్రాంతి తరువాత అధికారంగా చేరిక ఉండే అవకాశాలు ఉన్నాయంటూ టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ జాబితాలోనే ఉత్తరాంధ్ర నుంచి మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పేరు కూడా వినిపిస్తోంది. ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం ఎప్పట్నుంచో ఉంది. రెండేళ్ల కిందట అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, గండి బాబ్జీల చేరిక సందర్భంలోనూ పెద్ద చర్చే జరిగింది. ఈ ఇద్దరికీ రాజకీయ గురువైన కొణతాల కూడా చేరిపోతారనే ప్రచారం బాగానే జరిగింది. వైకాపా స్థాపించిన తరువాత ఆ పార్టీలో జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు కొణతాల. ఆ తరువాత, చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ తరఫున క్రియాశీలంగా ఉండటం మానేశారు. అయితే, ఆయన టీడీపీలో చేరికపై ఇప్పుడు కూడా కొణతాల వర్గం నుంచి స్పష్టమైన సమాచారం లేదు. కానీ, సంక్రాంతి తరువాత కొణతాల టీడీపీలో చేరడం దాదాపు ఖాయమనే కొంతమంది చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది నేతలపై టీడీపీ అధినాయకత్వం దృష్టి సారించిందనీ, రాయలసీమకు సంబంధించిన కొందరు నేతలతో ఇప్పటికే అధికార పార్టీకి చెందినవారు చర్చలు జరుపుతున్నారనీ, చాలావరకూ చర్చలు ఒక కొలీక్కి వచ్చాయనీ… కాబట్టి, మరికొద్ది రోజుల్లో చేరికల పర్వం మొదలౌతుందని టీడీపీ వర్గాలు బలంగా చెబుతున్నాయి.