రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ… కేసీఆర్ తో పాటు.. టీఆర్ఎస్ నేతలు పదే పదే చేస్తున్న హెచ్చరికలకు.. చంద్రబాబు ఘాటు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ఒక గిఫ్ట్ ఇస్తే మేం మూడు గిఫ్ట్లు ఇస్తామని.. వదిలి పెట్టే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. కేసీఆర్ పక్కన అవినీతి తమ్ముడు జగన్ చేరారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నంత కాలం.. ఏపీలో కేసీఆర్ బాగానే ఉన్నారని.. కానీ.. ఎప్పుడైతే.. ఏపీ ప్రయోజనాల కోసం.. టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిందో అప్పటి నుంచే… ద్వేషం బయటపెట్టుకుంటున్నారన్నారు. న్యాయం చేస్తారని నమ్మితే ఎన్డీఏ నమ్మక ద్రోహం చేసిందని మండిపడ్డారు. తుపాన్ వస్తే, రైతులు ఇబ్బందులు పడుతుంటే ఎవరూ రారని.. అదే… గుంటూరులో పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవానికైతే ప్రత్యేక విమానాల్లో వస్తారని మండిపడ్డారు. మన కష్టాలకు కారణం నరేంద్ర మోడీనేనని తేల్చి చెప్పారు. కష్టాలను… తీర్చకపోగా.. కొత్త సమస్యలను సృష్టిస్తూ.. పుండు మీద కారం చల్లి సంతోషిస్తున్నారన్నారు.
రాష్ట్రంపై ముగ్గురు మోడీలు దాడికి వస్తున్నారని.. దాడిని తిప్పికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆర్థిక ఇబ్బందులున్నా.. కేంద్రం డబ్బులివ్వలేదని… అయినా సరే ప్రాజెక్టులకు ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తున్నామన్నారు. రైతులకు ఎంత అవసరం అయితే అంత సాయం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన ఏకైక ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమన్నారు. ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయని దానికి అనుగుణంగా వ్యవసాయంలో మార్పులు చేస్తున్నామన్నారు. ప్రపంచానికి ఆదర్శంగా 8శాతం సేద్యం సాధించిన ఏకైక ప్రభుత్వం టీడీపీదేనని గుర్తు చేశారు. రైతులకు 24 వేల కోట్లతో రుణ విముక్తి చేసిన ప్రభుత్వం … టీడీపీ ప్రభుతవమన్నారు.
గుంటూరు జిల్లాలో సత్తెనపల్లిలో 36 అడుగుల ఎన్టీఆర్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. 50 ఎకరాల చెరువు మధ్యలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం ఏర్పాటు చేసిన చెరువుకి తారకరామా సాగరంగా నామకరణం చేశారు. కోడెల చొరవతో ఎన్టీఆర్ బసవతారకం ఆస్పత్రిని ఏర్పాటు చేశారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. చరిత్ర ఉన్నంత వరకూ ఎన్టీఆర్ శాశ్వతంగా ఉంటారని
ఎన్టీఆర్ జీవితం రాబోయే తరాలకు ఆదర్శమని చంద్రబాబు వ్యాఖ్యానించారు.