ఏఎన్ఐ ఇంటర్యూలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ..తనపై చేసిన విమర్శలకు టీడీపీ అధినేత చంద్రబాబు వెంటనే కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ఆక్రోశంతో ఏదేదో మాట్లాడుతున్నారని.. మోడీ అనడంపై చంద్రబాబు మండిపడ్డారు. నాలుగున్నరేళ్లలో ఏం చేశారో చర్చకు సిద్ధమా? అని చంద్రబాబు సవాల్ చేశారు. నాది ఆక్రోశమంటూ రాజకీయ నిందలు వేస్తారా? అని మండిపడ్డారు.
దేశాన్ని కాపాడుకునేందుకే కాంగ్రెస్తో కలిశామని… చేతకాని నిర్వాకంతో దేశాన్ని మోడీ శిథిలం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మహాకూటమి విఫలమయిందని… మోడీ గొప్పగా చెప్పడాన్ని… చంద్రబాబు ఖండించారు. తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే మోదీకి ఎందుకు సంబరమని ప్రశ్నించారు. వాస్తవాలను జనం గమనిస్తున్నారన్నారు.
తాను కేవలం లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రానికి సీఎంనని సర్వశక్తిమంతుడ్ని అంటున్న ప్రధాని..నాతో చర్చకు రాగలరా? అని సవాల్ చేశారు. ఎవరి అభివృద్ధి విధానమేంటో దేశం ముందు ఉంచుదామని సవాల్ చేశారు. కేసీఆర్ సన్నాసి, గాడు అని తిట్టినా మోడీకి బాధ లేదని.. రాష్ట్రం కోసం మేం నిలదీస్తే తప్పుబడతారా? అని ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు జరుగుతున్న విషయం తనకు తెలియనది మోడీ చెప్పుకు రావడాన్ని ఖండించారు. అసలు ఫెడరల్ ఫ్రంట్ కు సూత్రధారులు మోడీ, జైట్లీనేనన్నారు. ఫెడరల్ ఫ్రంట్లో మమతాబెనర్జీ ఉన్నారంటూ జైట్లీ ఎలా ప్రకటించారని.. ఆయనకేం సంబంధమని ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడుందని ..దాన్ని ప్రమోట్ చేస్తోంది మోదీ, జైట్లీనేనని తేల్చేశారు. మహాకూటమి విఫలం కాలేదని స్పష్టం చేశారు. విఫలమైంది ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి జైట్లీనేనన్నారు.
అదే సమయంలో ఏపీ పత్రికల్లో కేసీఆర్ ఫుల్ పేజీ ప్రకటనలు ఇవ్వడంపై చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ ప్రజల్ని రెచ్చగొట్టడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఏపీ మీడియాలో పెద్దఎత్తున ప్రకటనలు ఇచ్చి .. రెచ్చగొట్టాలని, అవమానించాలని కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. ఏపీలో బలహీనమైన ప్రభుత్వం ఉంటే .. తమ ఆటలు సాగుతాయని మోదీ, కేసీఆర్ భావిస్తున్నారని విశ్లేషించారు.