ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిర్మిస్తామని సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు చెబుతూ ఉంటారు. మంచితే.. ఎవరు మాత్రం వద్దంటారు? కానీ, ఆ అద్భుతం ఎన్నాళ్లకు సాకారం అవుతుంది.. ఇదే అసలు ప్రశ్న. మహానాడు కార్యక్రమంలో అమరావతి గురించి చంద్రబాబు మాట్లాడుతూ.. ఇంకా అదే పాత పాట పాడారు. గడచిన మూడేళ్లుగా ఏదైతే చెబుతూ వచ్చారో.. మరోసారి అదే వల్లెవేశారు. విశాఖలో జరిగిన మహానాడు ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ… అమరావతి, పోలవరం తనకు రెండు కళ్లు అని చంద్రబాబు చెప్పారు. రాజధాని ప్రాంతంలో అన్ని జిల్లాలకు చెందిన ప్రతీ ఒక్కరికీ ఉద్యోగాలూ ఉపాధి అవకాశాలు కల్పించడమే సంకల్పంగా తీసుకున్నానని చెప్పారు.
దేశంలోని పవిత్ర క్షేత్రాల నుంచీ పవిత్ర జలాలు తెప్పించి అమరావతిని పునీతం చేశామన్నారు! మహారాజధాని నిర్మాణం కోసం రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారనీ… రూ. 40 వేల కోట్ల విలువ చేసే భూముల్ని రాజధాని కోసం ఇచ్చారంటూ మెచ్చుకున్నారు. రాజధాని నిర్మాణం కోసం తన శక్తికి మించి పాటుపడతా అన్నారు. రాజధాని విషయంలో రాజీ పడేది లేదని చంద్రబాబు పునరుద్ఘాటించారు!
ఇదండీ.. అమరావతి గురించి చంద్రబాబు చేసిన ప్రసంగం. దీన్లో ఏదైనా కొత్త విషయం ఉందా..? రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రొగ్రెస్ ఎక్కడైనా వినిపిస్తోందా..? రైతులు స్వచ్ఛందంగా భూములిచ్చారూ.. తాను శక్తికి మించి శ్రమిస్తున్నానూ.. భవిష్యత్తు అద్భుతం.. రాజధాని విషయంలో రాజీపడను… రాజధాని అంశమై ముఖ్యమంత్రి ఇస్తున్న క్లారిటీ ఇదేనా..? నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందనేది చెప్పలేదు. ప్రస్తుతం ఏ స్థాయిలో నిర్మాణం ఉందో చెప్పలేదు. కనీసం, అమరావతి డిజైన్ల ఎంపిక ఏ స్టేజ్ లో ఉందో చెప్తే కాస్తైనా బాగుండేది. అమరావతి నిర్మాణం అనుకున్నంత ఈజీగా జరిగేది కాదనీ, మరో పదేళ్లు సమయం పడుతుందని చెప్పినా తప్పేముంది..? ఎలాగూ రాష్ట్రం పేదరికంలో కొట్టుమిట్టాడుతోందని చెబుతూ వస్తున్నారు కాబట్టి ప్రజలు అర్థం చేసుకుంటారు. చంద్రబాబు సింప్లిసిటీ ఏంటో ప్రజలకు తెలుసు! ఎంత పొదుపుగా ఉంటున్నారో చూస్తున్నారు కదా.
ఏదైతేనేం, మూడేళ్ల తరువాత కూడా ఆంధ్రా రాజధాని ఇంకా ఆకాంక్షల స్థాయిలోనే ఉంది. భవిష్యత్తులో నవ్యాంధ్ర అద్భుతం అనే చంద్రబాబు చూపిస్తున్నారు. అంతేగానీ, అమరావతికి సంబంధించిన వాస్తవాలను ఇప్పటికీ చెప్పడం లేదు. మూడేళ్లవుతున్నా ముఖ్యమంత్రి ప్రసంగం ఇంకా హామీల స్థాయిలో ఉంది! సో… వాటి అమలు గురించి ఆయన మాట్లాడతారని ఊహించలేం. అలాగని, వాస్తవాలను అంగీకరించే పరిస్థితిని ఆశించకూడదని మరోసారి అర్థం చేసుకోవాలి.