రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువచ్చే విషయంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం దారుణంగా విఫలం అయింది. ఇప్పట్లో వారు ఆ దిశగా ఏమైనా ముందడుగు సాధిస్తారనే నమ్మకం కూడా లేకుండా పోతున్నది. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా హోదా అంశాన్ని తమ వైఫల్యంగానే గుర్తించే పరిస్థితి వచ్చేసిందని చంద్రబాబునాయుడు అర్థం చేసుకున్నారు. హోదా సంగతి ఎలా పోయినా సరే, వైఫల్యం తమది కాదన్నట్టుగా ఒక బిల్డప్ ఇవ్వడానికి ఆయన తాపత్రయ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, తమ చేతగానితనాన్ని కూడా డాంబికంగా చాలా అందంగా ప్రొజెక్టు చేసుకోవడానికి చంద్రబాబునాయుడు చాలా అందంగా మాటలు అల్లుతూ ప్రజలకు వినిపిస్తున్నారు.
వాస్తవంగా చెప్పాలంటే కేవీపీ ప్రెవేటు బిల్లును రాజ్యసభలో పెట్టిన తర్వాత, దానిపై చర్చ తర్వాత, కేంద్రమంత్రి ‘హోదా అసలెందుకు?’ అంటూ ఇంటర్వ్యూలో చెప్పినతర్వాత దీనిపై వేడి పెరిగింది. జగన్ మరింత వేడి పెంచారు. ఇప్పుడు బాబు.. జనాన్ని చల్లబరిచే ప్రయత్నం చేస్తున్నారు.
హోదాపై కేంద్రానికి లేఖ రాస్తాం అని, చట్టంలోని అన్ని అంశాలు కేంద్రం చేయాల్సిందేనని, పోలవరం, రాజధానికి నిధులు ఇవ్వాల్సిందేనని, రైల్వేజోన్ పెండింగ్లో ఉందని ఆయన అన్నారు. ఇదే మాటలు గతంలో చాలా సార్లు అన్నారు. అయితే లాభం ఏమిటి? ఆయన క్రియాశీలంగా కేంద్రం వద్ద ఉద్యమశైలి అనుసరించకపోతే.. దక్కేది హళ్లికి హళ్లి సున్నకు సున్న. చంద్రబాబు ఇప్పటికీ.. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లే మనకు ఇస్తున్నారు తప్ప మరేమీ లేదు అనే మాట మాత్రమే చెబుతున్నారు.
ప్రత్యేకహోదా అడిగితే మీకు వనరులు ఉన్నాయి మీరు బాగా అభివృద్ధి చెందగలరు అంటున్నారని చంద్రబాబు వాపోతున్నారు. అదేం దీనాలాపనలో మనకు అర్థం కావడం లేదు.
మా సమర్థతను చూసి మీరు బాగా చేసుకోగలరు అంటున్నారని.. చంద్రబాబు ఈ కేంద్రం వంచనను కూడా తన ఘనత, గొప్పదనంలా బిల్డప్ ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే చంద్రబాబును సీఎం చేయడం వల్లనే ఈ రాష్ట్రానికి ప్రత్యేకహోదా రావడం లేదన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. అంతటి సమర్థుడైన సీఎం ఉండగా… హోదా లేకపోయినా పర్లేదు అని కేంద్రం భావిస్తున్నట్లుగా ఆయన మాటల్లోనే తెలుస్తోంది. ఈ సంకేతం ప్రజల్లోకి వెళితే.. వచ్చే ఎన్నికల్లో ఆయనను ఇంట్లో కూర్చోబెట్టి.. ననాయకుడు అసమర్థుడైనా హోదా తేగలవాడిని జనం నెత్తిన పెట్టుకుంటారని చంద్రబాబు తెలుసుకోవాలి. అందంగా మాటలు పేర్చి.. అన్ని వైఫల్యాలను తన అపూర్వ సమర్థత ఎఫెక్టుగా ప్రచారం చేసుకునే గోబెల్స్ టెక్నిక్కులను చంద్రబాబు మానుకోవాలి. ఏదో లేఖ రాస్తాం.. చేతులు దులిపేసుకుంటాం.. అనే వైఖరి కాకుండా కేంద్రం మెడలు వంచి సాధించడానికి ఆయన ప్రయత్నించాలి.