“కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం నాపై కేసుల్లేవు. పార్టీ ఇష్టానికి వ్యతిరేకంగా ఓదార్పు యాత్ర చేయడం, అది ఆపమన్నందుకు పార్టీనే కాదనుకుని బయటకు రావడం వల్లే సోనియాకి కోపం వచ్చి నాపై కేసులు పెట్టారు. “. ఈ మాటలు ఎవరివి? అని చిన్నపిల్లాడిని అడిగినా వైఎస్ జగన్‌వి అని ఠకీమని చెప్పేస్తారు. ఎందుకంటే అంత తరచుగా జగన్ ఈ మాటలు జనానికి చెబుతుంటారు మరి. అయితే ఈ సారి ఇదే విషయాన్ని కాస్త అటూ ఇటూగా మార్చి చెప్పింది జగన్ కాదు… సిఎం చంద్రబాబు.
నిజంగా ఆశ్చర్యపోవాల్సిన విషయమే. ఇప్పటిదాకా జగన్ అంటున్న మాటల్ని బలపరచేలా చంద్రబాబు మాట్లాడడం విస్తు గొలుపుతోంది. అసలు నిజంగా మాట్లాడింది చంద్రబాబేనా అనే సందేహం వస్తోంది. ప్రస్తుతం వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో చంద్రబాబు స్పీచ్‌లో తమకు అనుకూలంగా ఉన్న ఈ భాగాన్ని వైరల్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.
మాజీ సిఎం సోదరుడు నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి తన కుమారుడితో సహా తెలుగుదేశం పార్టీలో రెండ్రోజుల క్రితం చేరిన సంగతి తెలిసిందే. ఆయన పార్టీలో చేరిన సందర్భంగా చంద్రబాబు రాష్ట్ర విభజన దానికి కాస్త ముందు తర్వాత పరిణామాలను ప్రస్తావిస్తూ ఉపన్యాసం ఇచ్చిన సంగతీ తెలిసిందే. అందులో మాజీ సిఎం కిరణ్‌ను ఆయన ఆకాశానికి ఎత్తేసిన సంగతీ బాగానే హైలెట్ అయింది. అయితే ఆయన మాటల్లో ఎవరూ అంతగా పట్టించుకోని, చాలా కీలకమైన రెండు వాక్యాల సారం మాత్రం తీరుబాటుగా వెలుగు చూసింది… ఇప్పుడు ఆ రికార్డింగ్ వీడియో వైసీపీ ఫ్యాన్స్‌కి ఆయుధంగా మారింది.
తాజాగా వెలుగు చూసిన ఆ మాటల్లో ఏముందంటే… “వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీని ఎదిరించారు. దాంతో సోనియా గాంధీకి కోపం వచ్చింది ఆయనపై కేసులు పెట్టించింది” అంటూ విభజనకు ముందు పరిణామాల్ని గుర్తు చేసుకుంటూ చంద్రబాబు తన స్పీచ్‌లో పేర్కొన్నారు. అంటే జగన్ మాటల్ని బాబు సమర్ధించినట్టే అవుతోంది. నిజానికి ఆయన స్పీచ్ స్పష్టంగా విన్నవారు సైతం ఈ మాటల్ని సరిగా గమనించలేదు. అయితే సహజంగానే బాబు ఉపన్యాసంలో రంధ్రాన్వేషణ చేయక తప్పని అదే చేసి, వైసీపీ దీన్ని దొరకబుచ్చుకుంది.