చంద్రబాబునాయుడు అమెరికాలోని ఎఫ్‌బీఐని సైతం ప్రభావితం చేసి జగన్ పేరు అదానీ కేసులో పెట్టించారని సాక్షి దిగ్గజ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు వాపోయారు. ఆయన బాధ ఆయనది. తమకు మూలశంక వచ్చినా చంద్రబాబే ఏదో చేసి ఉంటాడని అనుకుంటారు. అలాంటిది అమెరికా కేసులో తమ జగన్ రెడ్డి పేరు వచ్చిందంటే చంద్రబాబు ఏమీ చేయకుండా ఉంటారా అని అనుకుంటారు. బయటకు చెప్పేస్తారు.
నిజానికి చంద్రబాబుకు ఇప్పుడు ఎఫ్‌బీఐ అక్కర్లేదు. సీఐడీ చాలు. ఆయన చేతిలో సీఐడీ ఉంది. గతంలో ఆయన పధ్నాలుగేళ్లు సీఎంగా ఉన్నారు కానీ..సీఐడీని ఇలా కూడా వాడుకోవచ్చు అని జగన్ రెడ్డి చూపించారు. చాలా సార్లు జగన్ రెడ్డి నాకు చాలా నేర్పారు అని స్వయంగా చంద్రబాబు కూడా చెప్పారు. ఆ నేర్పడం అధికార దుర్వినియోగమే. ఇప్పుడు చంద్రబాబు చేతిలో సీఐడీ ఉంది. ఆయన ఏమైనా చేయాలనుకుంటే ఎంత సేపు ? . వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే కేసులకు భయపడి కొమ్మినేని రెండు సార్లు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇప్పుడు ఆయనను పట్టుకెళ్లి రంగులు మారేలా ట్రీట్ మెంట్ ఇవ్వడం ఎంత సేపు ?
జత్వానీ కేసులో సాక్ష్యాలు అన్నీ కళ్ల ముందు ఉన్నాయి ?. సూత్రధారుడ్ని పట్టుకెళ్లడానికి ఎఫ్‌బీఐ కావాలా ?. లిక్కర్ స్కాంలో దోచేసిన డబ్బు ఎక్కడకు చేరిందో తెలియకుండా ఉంటుందా ?. ఇసుక స్కాంలో ఆధారాలన్నీ బహిరంగంగానే ఉన్నాయి కదా ?.ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి చిల్లర పని తామే శాశ్వతంగా అధికారంలో ఉంటామని అధారాలు బహిరంగంగా పెట్టే చేశారు. ఇప్పుడు సీఐడీ కేసులు పెట్టుకుంటూ పోతే.. ఎన్ని అవుతాయో చెప్పాల్సిన పని లేదు.
అందుకే వైసీపీ నేతలు.. ప్రతీ దానికి చంద్రబాబు పేరు చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎఫ్‌బీఐలో పేరు పెట్టించాల్సిన పని లేదు. ఆయన చేతిలో సీఐడీ ఉంది. చేయాలనుకుంటే ఏమైనా చేయగలరు. బయటపడిన ప్రతి అవినీతిని ఆయనే బయట పెట్టారని చెప్పాల్సిన అవసరం లేదు.