ఆత్మ విశ్వాసం, అతి విశ్వాసం.. ఈ రెండిటికీ ఉన్నది చిన్న తేడానే! మనం చేయగలం అనుకోవడం ఆత్మ విశ్వాసం. మనమే చేయగలం అనుకోవడంలో కాస్త ‘అతి’ ధ్వనిస్తుంది. ఏం రంగంలో ఉన్నవారైనా ఈ చిన్న తేడాను గుర్తుంచుకోవాల్సిందే. నంద్యాల ఉప ఎన్నిక విజయం తరువాత తెలుగుదేశం పార్టీలో మాంచి జోష్ వచ్చింది. ఎందుకంటే, అంతకుముందు పార్టీ కట్టుతప్పుతోందేమో అనే అనుమానాలు కొన్ని ఉండేవి. కొంతమంది నేతలు చంద్రబాబుతో ప్రమేయంలో సొంతంగా వ్యవహరిస్తున్నారనే కథనాలు కూడా వచ్చాయి. అలాంటి ఘటనల్ని మనం చూశాం కూడా. అయితే, నంద్యాల ఉప ఎన్నిక విజయంతో పార్టీ అంతా ఒకేతాటిపై ఉందనీ, చంద్రబాబు వ్యూహాలు పక్కగా అమలౌతున్నాయనే భరోసా పార్టీ శ్రేణుల్లో పుష్కలంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. నంద్యాల విజయాన్ని 2019 ఎన్నికల్లో కూడా కొనసాగిస్తామనే ధీమా వ్యక్తం చేశారు.
‘వచ్చే ఎన్నికలో మాత్రమే కాదు.. శాశ్వతంగా ఈ ప్రభుత్వం కొనసాగుతుంది. తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ బలంగా ఉంటేనే సామాన్య ప్రజలందరికీ లాభం జరుగుతుంది’ అన్నారు సీఎం. ‘అంతేతప్ప, దీనికి బదులుగా అటూఇటూ చూసే ప్రయత్నాలు ఏవైనా జరిగితే అంతిమంగా ప్రజలు నష్టపోతారు. లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్టు అవుతుంద’ని చంద్రబాబు చెప్పారు. అభివృద్ధిని కోరుకునేవారందరూ తెలుగుదేశాన్ని బలపరచాలని తాను ఎప్పుడో చెప్పానన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రజలు నైరాశ్యంలోకి వెళ్లారనీ, ఆ సమయంలో నేనొక విశ్వాసం ఇచ్చాననీ, అందరం కలిసి ముందుకుపోవాలే తప్ప, ఇళ్లలో కూర్చుని బాధపడితే అభివృద్ధి సాధించలేమని చెప్పానన్నారు. అనేక సమస్యల ఎదురౌతున్నా గడచిన మూడున్నరేళ్లలో అనూహ్యమైన అభివృద్ధిని సాధించామని చెప్పారు. అభివృద్ధిని అడ్డుకునేందుకు ఎన్నో కుట్రలు జరిగాయి, వాటన్నింటినీ తట్టుకుంటూ పట్టిసీమ వంటి ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. దీంతోపాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, అవి జరుగుతున్న తీరుతెన్నుల గురించి కూడా చంద్రబాబు వివరించారు.
2019లో కూడా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం అనే ధీమా వ్యక్తం చేయడం వరకూ ఓకే! శాశ్వతంగా టీడీపీ అధికారంలో ఉండాలని ఆకాంక్షించడం కూడా కొంతవరకూ ఓకే. కానీ, టీడీపీ అధికారంలో లేకపోతే ప్రజలు నష్టపోతారని చెప్పడం సరైంది కాదు! ఎందుకంటే, తెలుగుదేశం అభివృద్ధి చేస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉన్నంత కాలం అధికారంలో ఉంటుంది. ఆ నమ్మకం ప్రజలకు ఉంటేనే మరోసారి అవకాశం ఇస్తారు. చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఆదరిస్తారు, అవకాశం ఇస్తారు అనడం వేరు… మాకు ఓటేస్తే తప్ప అభివృద్ధి జరగదనే సంకేతాలు ప్రజలకు ఇవ్వడం వేరు! ‘మాకు అధికారం ఇవ్వండి’ అనేది అభ్యర్థనాపూర్వకంగా ఉండాలి. అంతేగానీ, ఇవ్వకపోతే మీరు నష్టపోతారు అనేది వేరే రకంగా ధ్వనించే అవకాశం ఉంది. ఈ మధ్య చంద్రబాబు మాటల్లో ఈ తరహా ధోరణి నెమ్మదిగా మొదలైందని చెప్పాలి! ఈ చిన్న తేడాను టీడీపీ శ్రేణులు గుర్తిస్తున్నాయో లేదో మరి!