నిన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఇప్పటికీ కలకలం సృష్టిస్తున్నాయి. మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ కి అపరిపక్వత అని, మోడీ కనుసన్నల్లోనే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నాడని ఇటు చంద్రబాబు, అటు లోకేష్ పలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే నిన్న చంద్రబాబు మరొకసారి సడన్ గా యూటర్న్ తీసుకుని, మోడీ టీమ్ లో పవన్ కళ్యాణ్ లేడని, కేవలం కెసిఆర్ , జగన్ మాత్రమే మోడీ టీం లో ఉన్నారని వ్యాఖ్యానించడమే కాకుండా, ఒకవేళ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే జగన్ కు వచ్చిన నొప్పి ఏంటి అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు నెటిజన్లు.
పవన్ కళ్యాణ్ మోడీ దత్తపుత్రుడు అని లోకేష్, బాబు ల వ్యాఖ్యలు:
చంద్రబాబు అభివృద్ధి పుత్రుడని, జగన్ అవినీతి పుత్రుడని, పవన్ కళ్యాణ్ మోడీ దత్తపుత్రుడు అని ఆ మధ్య ( జూలై) మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అలాగే నవంబర్ మొదటి వారంలో కూడా, మోడీ దత్తపుత్రుడు పవన్ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు అంటూ లోకేష్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
https://twitter.com/naralokesh/status/1059444022362628098?s=08
ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పలు వేదికలపై పవన్ కళ్యాణ్ ని మోడీ దత్తపుత్రుడుగా అభివర్ణిస్తూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జగన్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా మోడీ తో కుమ్మక్కు అయ్యారని, ఈ ముగ్గురు కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని గత ఆరు నెలలుగా దాదాపు ప్రతి సభలో కూడా చంద్రబాబు వ్యాఖ్యానిస్తూ వస్తున్నాడు. చంద్రబాబు లోకేష్ లతో పాటు మిగిలిన టిడిపి నాయకులు కూడా మొన్నటిదాకా పదేపదే ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఆ వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ అనుంగు మీడియా ప్రముఖంగా ప్రచురిస్తూ వచ్చింది. ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ మోడీ టీం లో లేడు అని చంద్రబాబు కొత్త పాఠం మొదలు పెట్టారు.
బాబు యూ-టర్న్ కి కారణాలు: తెలంగాణ ఎన్నికల ఫలితమా, సర్వే రిపోర్టు ల ప్రభావమా? వ్యూహాత్మకమా?
ఈ నాలుగేళ్లలో చాలా విషయాలలో చాలాసార్లు బాబు యూ టర్న్ తీసుకున్నారు. ప్రత్యేక హోదా కావాలని, అక్కర్లేదని, కావాలని అలాగే డిమానిటైజేషన్ మంచి నిర్ణయం అని, తానే సలహా ఇచ్చానని, అబ్బే , కాదు అది చెత్త నిర్ణయం అని, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మీద , బిజెపి మీద కూడా బాబు యూ- టర్న్స్ తీసుకున్నాడు. ఇప్పుడు జనసేన మీద కూడా ఇలాంటి యూ టర్న్ ని తీసుకున్నాడా అన్న సందేహాలు వస్తున్నాయి. ఒకవేళ అది నిజమే గనుక అయితే దానికి కారణాలు ఏమై ఉండవచ్చు అన్న విశ్లేషణలు మొదలయ్యాయి.
తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు మాత్రం, బాబు 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తో జనసేన పార్టీ మీద పొలిటికల్ మైండ్ గేమ్ మొదలు పెట్టాడని, ఈ దెబ్బకి జనసేన చిత్తు కావడం ఖాయమని సంబరపడిపోతుంటే, తెలుగుదేశం పార్టీ వ్యతిరేకులు మాత్రం చంద్రబాబు చాణక్యత ఎంతో తెలంగాణ ఎన్నికల్లోనే బట్టబయలైందని, ఇప్పుడు వేరే అవకాశం లేక జనసేన ను దువ్వడానికి ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు. జనసేన అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ టీవీ ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ, చంద్రబాబు స్వయంగా చేయించుకున్న సర్వేలో, తెలుగుదేశం పార్టీకి 20 సీట్లకు మించి విజయ అవకాశాలు లేవని రిపోర్టు వచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన తెలుగుదేశం పార్టీని బతికించుకోవలసిన “చారిత్రక అవసరం” తోనే బాబు అత్యంత బలమైన సామాజిక వర్గం మద్దతు కలిగిన జనసేన పార్టీ మద్దతు పొందడానికి ప్రయత్నిస్తున్నాడని వారు అంటున్నారు.
అయితే తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత బాగా డీలా పడిపోయిన మరి కొంతమంది తెలుగుదేశం పార్టీ అభిమానులు మాత్రం, ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటుందోనన్న భయం వేస్తోందని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని దూరం చేసుకోకుండా ఉండాల్సిందని, ఇప్పటికైనా చంద్రబాబు దిద్దుబాటు చర్యలు వీలైనంత తొందరగా మొదలు పెట్టాలని వారు అంటున్నారు.ఇప్పుడు జనసేన పై చంద్రబాబు వ్యాఖ్యలని ఆ దిద్దుబాటు కోణంలోనే వారు చూస్తున్నారు.
జనసేన అభిమానులు ఏమంటున్నారు?
అయితే జనసేన అభిమానులు మాత్రం, పవన్ కళ్యాణ్ టిడిపి ట్రాప్ లో పడవద్దని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తులు చేస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసిపోతే, గత ఆరు నెలలుగా పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు విలువ లేకుండా పోతుందని, పవన్ కళ్యాణ్ విశ్వసనీయత మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారంటున్నారు. గెలిచినా, గెలవకపోయినా జనసేన పార్టీ సొంతంగా పోటీ చేసి, తన బలాన్ని నిరూపించుకోవాలని, తాత్కాలిక ప్రయోజనాలను కాకుండా పాతికేళ్ల రాజకీయ ప్రస్థానాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ నిర్ణయాలు తీసుకోవాలని జనసేన అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు వ్యాఖ్యలకు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.
-జురాన్