రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబుకి ప్రజల్లో ఇంకా నిరూపించుకోవడానికి ఏమీ లేదు. ఆయన తెచ్చిన సంస్కరణలు అంత గొప్పవని ప్రత్యర్థి పార్టీల నేతలే ఒప్పుకుంటారు. దేశ రాజకీయాల్లో ఆయన స్థానం పదిలం. అయినా సరే యువతరంతో పరుగుపెట్టే పట్టుదల ఆయనది. ఎప్పటికప్పుడు తనను తాను మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చుకునే నిత్య విద్యార్థి చంద్రబాబు. గెలిచిన రోజు నుండీ ఈరోజు వరకూ ఆయన పరుగు పెడుతూనే ఉన్నాడు. పరుగులు పెట్టిస్తూనే ఉన్నాడు. అన్నిఅంశాల పట్లా పిల్లలను, పెద్దవాళ్ళను, అటు యువతను సైతం అప్రమత్తం చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. చెప్పాలనుకున్న విషయాన్ని ముక్కుసూటిగా చెప్పేస్తున్నారు. వెనుకబడ్డ వర్గాల ప్రజలు అన్నిరకాల ముందుకురావాల్సిన అవసరం ఉందని , వారికి తోడ్పాటు ఇవ్వడమన్నది కూడా బాధ్యతే అని సంపన్న వర్గాల ప్రజలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సభలు, సమావేశాలు అంటూ నిత్యం ప్రజల మధ్యనే తిరుగుతున్నారు. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకూ అందరితో సామాన్యుడి మాదిరే ఆయన కలిసిపోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కరాలను కూడా అక్కడికక్కడే సూచించడంతో ఆయనతో పరుగుపెట్టలేక అధికారులు సైతం ఇబ్బంది పడుతున్న సందర్భాలు చూస్తున్నాం..
లోకేష్ విషయానికి వస్తే తండ్రి దగ్గర ఏదో చేసేసి మార్కులు కొట్టేయాలని అనుకోవట్లేదు ఆయన . తండ్రి మాదిరే నిత్యం ప్రజల్లో తిరుగుతూ తనకంటూ ఒక శైలిని ఏర్పాటుచేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇటీవల ఆయన ప్రసంగాల్లో పరిణితి ప్రజలను ఆకట్టుకుంటోంది. అటు కేడర్ లోనూ ఉత్సాహాన్ని నింపుతోంది. అభివృద్ధి కార్యక్రమాల్లో కూటమి నాయకులను కూడా తన వెంటే త్రిప్పుతూ ప్రజల్లో వాళ్లకు కూడా గౌరవాన్ని తగ్గించని ఆయన నైజం అన్ని పార్టీల కార్యకర్తలకూ ఆయన్ను దగ్గర చేస్తుంది. ఎప్పటికప్పుడు తన ప్రసంగాల్లో పవన్ అన్న అంటూ ఆప్యాయంగా ప్రస్తావించే తీరు చూస్తుంటే అందరి మనిషిగా మారాలన్నఅతని తాపత్రయం గతంలో ఆయన్ను అభిమానించని వ్యక్తులకు సైతం నచ్చుతోంది. పార్టీ కార్యక్రమాలను ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలను మరోవైపు రెండింటినీ మెరుగైన రీతిలోనే ఆయన నడుపుతున్న విధానం బాగుందని సామాన్య ప్రజలే మాట్లాడుకుంటున్నారు.
అటు మంత్రిగా రాష్ట్రం అంతా తిరుగుతూనే ఎమ్మెల్యేగా భారీ విజయాన్ని ఇచ్చిన మంగళగిరి నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేయడంలేదు. అనేక రకాలైన అభివృద్ధి పనులు ఏదో ఒక ప్రాంతంలో ప్రతి రోజూ జరుగుతూనే ఉంటాయి ఆ నియోజకవర్గంలో. ఇటీవలే ఆయన పేద ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అయిదు రోజుల కార్యక్రమం అది. సుమారు మూడువేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ. ఇప్పటికే మూడు రోజుల కార్యక్రమం పూర్తి అయింది. సగం మందికి పైగా పంపిణీ జరిగిపోయింది. ఇచ్చిన మాటకు కట్టుబడి బట్టలుపెట్టి మరీ పట్టాలు ఆడబిడ్డలకు స్వయంగా అతనే వెళ్లి ఇవ్వడంతో ఆ పేద ప్రజల కుటుంబాల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అటు కూటమి నేతలకు ధైర్యం ఇవ్వడంలో, అటు స్వర్ణాంధ్ర నిర్మాణంలోనూ తండ్రీ కొడుకులు ఇద్దరూ విశ్రాంతి లేకుండా కార్మికుల మాదిరే పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు.