ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం నాడు భాజపాయేతర పార్టీల నేతల భేటీ జరగాల్సి ఉంది. కోల్ కతా ర్యాలీ విజయం అనంతరం… దేశవ్యాప్తంగా ఇలాంటి భారీ సభల్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసుకోవడం కోసం 23న భేటీ ఉంటుందని ముందుగా అనుకున్నారు. అయితే, అనూహ్యంగా ఫరూక్ అబ్దుల్లా విదేశాలకు వెళ్లాల్సి రావడం, మరికొన్ని పార్టీలకు చెందిన నేతలు కూడా వారి సొంత రాష్ట్రాల్లో బుధవారం నాడు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు ఉండటంతో… బుధవారం జరగాల్సిన భేటీని వాయిదా వేశారు. అందరూ అందుబాటులో ఉండే తేదీని నిర్ణయించి ఈ భేటీ నిర్వహిస్తారని తెలుస్తోంది.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. కోల్ కతా ర్యాలీకి రాహుల్ రాలేదు. దీంతో దాని గురించి కాసేపు ఇద్దరూ చర్చించుకున్నట్టు సమాచారం. అంతేకాదు, ఆంధ్రా రాజధాని అమరావతిలో కూడా భాజపాయేతర పార్టీల భారీ సభను నిర్వహించాలని చంద్రబాబు అనుకున్న సంగతి తెలిసిందే. ధర్మపోరాట దీక్షల ముగింపు సభగా ఈ కార్యక్రమం జరపాలని అనుకుంటున్నారు. ఇదే అంశమై రాహుల్ తో చంద్రబాబు చర్చించినట్టు సమాచారం. ఏపీలో జరిగే సభకు రాహుల్ తప్పనిసరిగా రావాలని కూడా ఈ సందర్భంగా ఏపీ సీఎం పిలిచినట్టు తెలుస్తోంది. అమరావతిలో నిర్వహించబోయే సభ తేదీలు ఖరారు అయిన తరువాత, రాహుల్ గాంధీతోపాటు ఇతర పార్టీల నేతల్ని సాదరంగా ఆహ్వానించాలని చంద్రబాబు భావిస్తున్నారు.
కోల్ కతా తరహా ర్యాలీలు దేశవ్యాప్తంగా చేపడితే… మోడీ వ్యతిరేక భావన ప్రజల్లోకి మరింత బలంగా వెళ్తుందని ఈ భేటీలో రాహుల్, చంద్రబాబుల మధ్య వ్యక్తమైన అభిప్రాయంగా తెలుస్తోంది.అన్ని పార్టీల నేతలు అందుబాటులోకి రాగానే… ఎన్డీయేతర పార్టీల సమావేశం ఏర్పాటు చేసుకోవాలనీ, కార్యక్రమాల షెడ్యూల్ ని కూడా ఖరారు చేసుకోవాలని రాహుల్ అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది. ఈ అంశాలపై రాహుల్ తో చర్చించిన చంద్రబాబు… ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.