“గంజాయి పండించినా, కాల్చినా, రవాణా చేసినా, అమ్మినా అదే ఆఖరి రోజు” ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం కేబినేట్ భేటీ తర్వాత చేసిన కామెంట్స్ ఇవి. గత అయిదేళ్లుగా గంజాయి రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోవడం, నేరాలకు గంజాయి బానిసలే కారణం కావడం… ఏపీలో ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరాంధ్ర మన్యం నుంచి విపరీతంగా గంజాయి సప్లై కావడం, ఆ గంజాయికి ఏపీతో పాటుగా సరిహద్దు రాష్ట్రాల్లో కూడా డిమాండ్ ఉండటంతో ఓ రాజకీయ పార్టీ నేతలు బాగా దండుకున్నారని వార్తలు వచ్చాయి.
అప్పట్లో ఓ ఉన్నత పోలీస్ అధికారి పదవి పోవడానికి గంజాయి తోటలు కాల్చడమే… అనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు గంజాయి విషయంలో సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ విషయంలో పోలీసులకు కూడా బలమైన ఆదేశాలు వెళ్ళాయి. అందుకే పోలీసులు కూడా ఇప్పుడు గంజాయి విషయంలో చిన్న క్లూ దొరికినా వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు. గురువారం చిత్తూరు జిల్లాలో 2 కేజీల గంజాయి పట్టుకోవడంతో పాటుగా మారణాయుధాలు కూడా ఇద్దరి నుంచి స్వాధీనం చేసుకోవడం కలకలం రేపిన అంశంగా చెప్పాలి.
ఇక తెలంగాణాలో కూడా గంజాయి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. భద్రాచలం, ములుగు అడవుల నుంచి పెద్ద ఎత్తున గంజాయిని సప్లై చేస్తున్న సంగతి తెలిసిందే. దీనితో ఆ గంజాయిపై తెలంగాణా పోలీసులు భారీ ఎత్తున చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. హైదరాబాద్ లో గంజాయి ఆయిల్, చాక్లెట్ లు పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత నెల రోజుల్లో దాదాపు 40 కేజీలకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ పై కూడా హైదరాబాద్ లో పోలీసులు సీరియస్ గా నిఘా పెట్టారు.
ఈ తరుణంలో ఓ కీలక సమాచారం ప్రభుత్వ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి గంజాయి దేశ వ్యాప్తంగా ఎక్కువగా సప్లై కావడంతో ఉమ్మడి వ్యూహాన్ని అమలు చేసేందుకు సిద్దమవుతున్నారు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి. బుధవారం చంద్రబాబు మాట్లాడుతూ గంజాయి విషయంలో కొత్త చట్టం చేయడానికి కూడా సిద్దంగా ఉన్నట్టు ప్రకటించారు. దీనికి అదనపు బలగాలను కూడా కేటాయిస్తామన్నారు. దీనితో రెండు తెలుగు రాష్ట్రాలు సంయుక్తంగా ఓ చట్టాన్ని రూపొందించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
దీనికి కేంద్ర సహకారం కూడా తీసుకునేందుకు ముఖ్యమంత్రులు సిద్దమయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఆపరేషన్ కగార్ తో మావోలను వేటాడుతున్న కేంద్రం… మావోల ఆర్ధిక వనరులపై దెబ్బ కొట్టేందుకు సిద్దమైంది. వారి ఆర్ధిక వనరులలో గంజాయి కీలకం అనే వార్తలు చూస్తూనే ఉంటాం. చత్తీస్ఘడ్ లో బలగాల కూంబింగ్ పెరగడంతో తెలంగాణా వైపు వస్తున్నారు మావోలు. అందుకే ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో బలగాలు మొహరించాయి. ఇదే సమయంలో గంజాయి కూడా అక్రమ రవాణా జరిగే అవకాశం ఉంది. దీనితో రెండు తెలుగు రాష్ట్రాలు సంయుక్తంగా రూపొందించే చట్టానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.