‘ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి రెండున్నర నెలలుగా ఆందోళన చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా మన వాళ్లు ఉద్యమిస్తున్నారు. మీకు మాత్రం ఏం పట్టడం లేదు’ ఇదీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులపై చూపించిన ఆగ్రహం. ఉత్తరాంధ్ర పర్యటన అర్ధాంతరంగా ఆగిపోవడం, విశాఖపట్నం నుంచి చంద్రబాబు నాయుడ్ని నేరుగా హైదరాబాద్ తరలించడం తెలిసిన విషయమే. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు నాయుడ్ని తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కలుసుకున్నారు. తనను కలిసేందుకు వచ్చిన నాయకులపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. అమరావతి రాజధానిగా కొనసాగాలంటూ 75 రోజులుగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా తెలంగాణ తెలుగుదేశం నాయకులు మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరించడం ఏమిటంటూ కాస్త ఘాటుగానే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. దీనికి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్.రమణ కల్పించుకుని బాగ్ లింగంపల్లిలో జరిగిన అమరావతి సమావేశానికి తాము వెళ్లి సంఘీభావం తెలిపామని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, చంద్రబాబు నాయుడు మాత్రం అందుకు సమాధాన పడలేదని, ‘వేరెవరో నిర్వహించిన సమావేశానికి మీరు వెళ్లి సంఘీభావం తెలియజేయడమేమిటి. మీరే ఆందోళనలు చేపట్టాలి కదా.. సమావేశాలు నిర్వహించాలి కదా..’ అని మండిపడినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం అన్ని వైపుల నుంచి ఆందోళనలు చేయాలని, దానికి తెలుగుదేశం పార్టీ సారధ్యం వహించాలని చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నాయకులతో అన్నట్లు సమాచారం. తెలంగాణలో పార్టీ ఇబ్బందుల్లో ఉన్నా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తాము నిలబడాలంటే అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమాలకు తెలంగాణలో కూడా మద్దతు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు సూచించినట్లు చెబుతున్నారు. అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా త్వరలో హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఓ కార్యక్రమం నిర్వహించాలని కూడా సూచించినట్లు సమాచారం.