తిత్లీ తుఫాను బీభత్సం సృష్టించిందనీ, రైతాంగం చాలా నష్టపోయారు అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… బాధితుల సహాయం కోసం హెరిటేజ్ సంస్థ రూ. 66 లక్షలు విరాళం ఇవ్వడం చాలా సంతోషించదగ్గది అన్నారు. రాష్ట్రంతోపాటు, దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉండేవారు, అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా ‘తూర్పు’ అనే ప్రత్యేకమైన ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. ‘తిత్లీ ఉద్దానం రీ కన్ ష్ట్రక్షన్ ప్రోగ్రామ్ యూనిట్’.. వచ్చిన నిధులూ విరాళాలూ అన్నీ దీన్లో జమ చేస్తామని చెప్పారు. ఇక్కడి ప్రజలు కష్టాల నుంచి బయటపడి, మళ్లీ నిలదొక్కునే వరకూ ఈ ఆర్గనైజేషన్ ద్వారా సహకరిస్తామన్నారు. వచ్చిన సొమ్మును ప్రభుత్వ అకౌంట్లో కాకుండా దీన్లో పెడతామని చెప్పారు.
తుఫాను తీవ్రతను ముందుగానే తెలుసుకోగలిగామనీ, ఏ ప్రాంతంలో తీరం దాటుతుందో.. ఆయా ప్రాంతాలను ముందుగానే అప్రమత్తం చేశామని సీఎం చెప్పారు. దీంతో కొంతమేరకు ప్రాణ నష్టాన్ని తగ్గించుకోగలిగామనీ, కానీ కొంతమంది రైతులు తుఫాను తీవ్రతకు ప్రాణాలు కోల్పోవాల్సి రావడం దురదృష్టకరం అన్నారు. తుఫాను బీభత్సం సృష్టించిన మొదటి రోజే తాను విశాఖ నుంచి సమీక్ష చేశాననీ, ఆ మర్నాడే నేరుగా శ్రీకాకుళం జిల్లాకు వచ్చి, ఇక్కడి నుంచే సహాయక పనులు మొదలుపెట్టామన్నారు. క్షేత్రస్థాయిలో ఉంటే తప్ప త్వరితగతిన చర్యలు జరగవన్న ఉద్దేశంతోనే పలాసాలోనే క్యాంపు ఆఫీస్ పెట్టుకుని, సచివాలయం మొత్తాన్ని ఇక్కడికి రప్పించామన్నారు. పదిహేను మంది మంత్రులు ఇక్కడే ఉన్నారనీ, దసరా సందర్భంగా ఊరికి వెళ్లలేదనీ, ఈ పండుగ మీ మధ్యనే జరుపుకొంటున్నామంటే.. అదీ ఈ మంత్రి వర్గానికి ఉండే పట్టుదల, ప్రజలపై ఉండే అభిమానం, కాపాడుకోవాలనే తపన అన్నారు. సహాయక చర్యల విషయంలో అలసత్వం ప్రదర్శించినవారు ఎవరైనా సరే, వారిపై తాను చర్యలు తీసుకుంటానని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
సహాయ నిధులు, విరాళాలు… వీటిని వినియోగిస్తూ జరిగే కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా ఒక ఆర్గనైజేషన్ పెట్టడం మంచిదే. ఆ అకౌంట్ నుంచే నిధులన్నీ వినియోగించడం ద్వారా… ఏయే పనులకు ఎంతెంత వినియోగం అవుతున్నాయనే స్పష్టత అందరికీ ఉంటుంది. హుద్ హుద్ తుఫాను నిధులు దుర్వినియోగం అయిపోయాయనీ… ఎక్కడెక్కడ ఎంత ఖర్చు చేశారో తెలీదని వైకాపా నేతలు విమర్శిస్తున్నారు. తిత్లీ సహాయక నిధుల విషయంలోనూ ఆరోపణలు మొదలు పెట్టేసిన పరిస్థితి. తూర్పు ఆర్గనైజేషన్ ప్రత్యేకంగా పెట్టడం వల్ల.. అన్నీ మరింత పారదర్శకంగా ఉండే అవకాశం ఉంది.