ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవాన్ని ప్రశ్నించే పనిలో పడింది వైకాపా పత్రిక సాక్షి! తప్పేం లేదు, కానీ… ఆ ప్రశ్నించే క్రమంలో వారి అవగాహనా రాహిత్యాన్ని బయటపెట్టుకుంటే నవ్వులపాలౌతారు. అనుభవాన్ని ప్రశ్నిస్తున్న క్రమంలో అజ్ఞానాన్ని బయటపెట్టుకోకూడదు. ఒక అనుభవజ్ఞుడి ఆధ్వర్యంలో సాగుతున్న ప్రభుత్వ పాలనను ప్రశ్నించే ముందు… ఆ ప్రభుత్వ నిర్ణయాలపరంగా జరిగిన నష్టాన్ని ఎత్తి చూపగలిగితే మంచిదే. అంతేగానీ… ప్రభుత్వ నిర్ణయాల పరిధిలో లేనివి, మానవ నియంత్రణలో లేని అంశాలను కూడా ప్రభుత్వ వైఫల్యాలే అని ప్రశ్నించడం ఏరకమైన జర్నలిజమో సాక్షికే తెలియాలి!
ఇవాళ్టి (ఆదివారం) పత్రికలో ‘అక్కరకు రాని అనుభవం’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో వైఫల్యాలను ఎత్తిచూపే ఓ కథనం అచ్చేశారు. నేరాల్లో రాష్ట్రం పైపైకి అన్నారు. రాజధాని ప్రాంతంలోనే మహిళలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. ఇది కచ్చితంగా ఖండించాల్సిన అంశమే. కానీ, అధికార పార్టీ అండతోనే అత్యాచారాలు జరుగుతున్నాయని రాసేశారు. ఒక ఉన్నాది చర్యను ప్రభుత్వ పాలన వైఫల్యమని ఎలా చెప్పేస్తారు..? ఆ చర్య తరువాత బాధితులకు న్యాయం జరగక్కపోయినా, నేరస్థులకు శిక్ష పడకపోయినా అది ప్రభుత్వ వైఫల్యమౌతుందిగానీ… ఆ చర్యకు పాల్పడిన ఫలానా వ్యక్తి అధికార పార్టీకి చెందిన వాడని తీర్మానించేయడం ఏ తరహా జర్నలిజం? నేరప్రవృత్తి గల వ్యక్తులను ఏదో ఒక రాజకీయ పార్టీ రంగుంలోంచి తప్ప చూడలేని సాక్షి పాత్రికేయాన్ని ఏమనాలి..?
మిగతా అంశాలూ ఇంతే… మానవ తప్పిదాలను, ప్రకృతి వైపరిత్యాలను, కోర్టు పరిధిలో ఉన్న అంశాలను కూడా చంద్రబాబు పాలన వైఫల్యాలనే రాసేశారు. బెజవాడ దుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయి. జరిగాక చర్యలు లేకపోతే ప్రభుత్వం వైఫల్యం! కానీ, జరగడమే వైఫల్యమంటే ఎలా..? గత ఏడాది కోడి పందాల నిర్వహణ ఆపాలంటూ కోర్టు చెప్పినా… ప్రభుత్వం అడ్డుకోలేకపోవడం వైఫల్యమట! వాడపల్లిలో లాంచి ప్రమాదం కూడా వైఫల్యమేనట! తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంకలో జరిగిన నాటు పడవ ప్రమాదం కూడా ప్రభుత్వ వైఫల్యమట! రమణ దీక్షితుల అంశంలో కూడా ప్రభుత్వ వైఫల్యమేటన! అగ్రిగోల్డ్ బాధితులను న్యాయం చేయడంలో కూడా ప్రభుత్వానిది వైఫల్యమేట! ఈ వ్యవహారం కోర్టులో ఉన్నా కూడా కారణం ప్రభుత్వానిదేనట! తిత్లీ, పెథాయ్ తుఫాను నష్టం కూడా ఫెయిల్యూరేనట! జగన్ పై కోడి కత్తిదాడి కూడా ప్రభుత్వ ప్రోత్సామేనట!
అనుభవాన్ని ప్రశ్నించే ప్రశ్నలంటే ఇవేనా..? ఇందులో సగానికిపైగా ప్రకృతి విపత్తులు, మరికొన్ని మానవ తప్పిదాలు. అంతేగానీ, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వికటించి వచ్చిన ఫలితాలు కావివి..! మరికొన్ని ఉన్మాద చేష్టలు. ఇంకొన్ని ఊహించలేని ప్రమాదాలు. వీటిని ఆధారంగా చేసుకుని ముఖ్యమంత్రి అనుభవాన్ని, పాలనను ప్రశ్నించడం ఎంతవరకూ సబబో వారికే అర్థం కావాలి!