ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల దెబ్బకు ఠారెత్తిపోతున్నారు. గ్రామాలకు గ్రామాలే ఖాళీ అయిపోతున్నాయని ఈనాడులో డీటెయిల్డ్ కథనాలు వస్తున్నాయి. పల్లెవాసులందరికీ వలసబాట తప్పని పరిస్థితి. మిగతా విషయాలు పక్కన పెట్టినా కనీసం మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి. ఇక పంట చేతికొచ్చిన రైతులు కూడా అధికార పార్టీ నాయకుల బినామీ బ్రోకర్ల దెబ్బకు పూర్తిగా నష్టపోతున్నారు. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చియార్డులో రైతుల కష్టాల గురించి నెల రోజులుగా మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. రోజుకు రెండు మూడు కోట్ల రూపాయల వరకూ బ్రోకర్లు మింగేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలను దగ్గరుంచి ప్రోత్సహిస్తున్నది కూడా అధికార పార్టీ నాయకులే. ఇప్పుడు చంద్రబాబు-జగన్‌ల మధ్య నడుస్తున్న బాహుబలి రేంజ్ యుధ్దసమయంలో వైకాపా నాయకులు ఎవరైనా తప్పు చేస్తే గంటల వ్యవధిలోనే ఊచలు లెక్కపెట్టాల్సి రావడం ఖాయం. కేసుల దెబ్బకు ఆ పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలే ఠారెత్తిపోతున్నారు.
మరి రైతు బాంధవుడిని, రాష్ట్రానికి పెద్దన్నని అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేస్తున్నాడు? మాటలు చెప్తున్నాడు. కేవలం మాటలు మాత్రమే చెప్తున్నాడు. ఆ మాటలన్నీ తన భజన మీడియాలో బాగా హైలైట్ అయ్యేలా చేసుకుంటున్నాడు. మామూలుగా అయితే కాపులకు వెయ్యి కోట్లిస్తున్నాం, బిసిలకు రెండు వేల కోట్లిస్తున్నాం, ఎస్సీఎస్టీలకు ఇన్నోవా వాహనాలు ఇస్తున్నాం అని చెప్పే చంద్రబాబు ఎండల దెబ్బకు తాగునీరు కూడా లేకుండా ఇబ్బందిపడుతున్న గ్రామాలకు ఎన్ని వేల కోట్లు కేటాయిస్తున్నాడు? మిర్చి రైతుల కష్టాలు తీరడానికి ఏం చర్యులు తీసుకుంటున్నాడు? రైతుల చేతికి పంట చేతికి వచ్చినప్పుడే ధరలు పడిపోయేలా చేసి బ్రోకర్ల ముసుగులో ఉండే నాయకులు కోట్లాది రూపాయలు కొట్టేస్తూ ఉంటారు. అంతా కూడా ఓ నెల రోజుల వ్యవహారం అని చెప్పొచ్చు. మరి నెల రోజులుగా అన్ని పార్టీల భజన మీడియాలోనూ, స్వతంత్ర మీడియాలో కూడా రైతుల కష్టాల గురించి వరుస కథనాలు వస్తూ ఉంటే, ప్రతిపక్ష నాయకుడు కూడా మిర్చి రైతుల కష్టాల గురించి మాట్లాడుతూ ఉంటే చంద్రబాబుకు మాత్రం వినిపించడం లేదా? లేకపోతే పంట అంతా కూడా బ్రోకర్ల చేతికి వెళ్ళిన తర్వాత బ్రోకర్లకు లబ్ది చేకూరేలా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడా? నెల రోజులుగా పట్టించుకోని చంద్రబాబు….ఇప్పుడు తాజాగా న్యాయం చేస్తా అన్న ఓ డైలాగ్ కొట్టి వదిలాడు. ఇంకో నెల రోజుల తర్వాత రైతులకు లాభం కలిగేలా చంద్రబాబు నిర్ణయం తీసుకుంటే అప్పటికి పంట అంతా కూడా రైతుల చేతుల్లో ఉంటుందా? బ్రోకర్ల చేతుల్లో ఉంటుందా? డ్యాష్ బోర్డ్ అని, ఇంకోటనీ చెప్పి రాధాకృష్ణతో కలిసి బాహుబలి రేంజ్ బొమ్మ చూపించాడు చంద్రబాబు. రాష్ట్రంలో ఏ ఒక్క పౌరుడికి ఈగ కుట్టినా, దోమ కుట్టినా….ఎక్కడ ఏం జరిగినా తనకు తెలిసిపోతుందని చెప్పుకొచ్చాడు. క్షణాల్లో నిర్ణయాలు తీసుకుంటానని, సత్వరమే న్యాయం జరిగేలా చేస్తానని చెప్పాడు. మరి ఏప్రిల్ నెల కూడా స్టార్ట్ అయినప్పటికీ దాహార్తితో అల్లాడిపోతున్న గ్రామసీమలను ఆదుకునే విషయంలో నిర్ణయం తీసుకోవడానికి చంద్రబాబుకు ఇంకా ఎంత టైం పడుతుంది? రుణమాఫీ పేరుతో రైతులకు సూపర్ ఝలక్ ఇచ్చాడు చంద్రబాబు. ఎన్నో కష్టాల మధ్య కూడా పంటను చేతికి తెచ్చుకున్న రైతులకు కూడా న్యాయం చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉంటే ఎలా? అధికారంలోకి రావడానికి అవసరమైన ఓట్లు అడగడానికి వెళ్ళిన సందర్భంలో చూపించిన ప్రేమలో అణువంత అయినా రైతులకు అవసరమైనప్పుడు చూపించలేకపోతే ఎలా చంద్రబాబుగారూ?