ఫీచర్ ఫోన్ రంగంలో దూసుకుపోయిన నోకియా స్మార్ట్ ఫోన్ ప్రభావాన్ని తేలికగా తీసుకుని కనిపించకుండా పోయింది. అలాగే కొడాక్ కెమెరాలు..ఇలా చెప్పుకుంటూ పోతే.. తమ తమ రంగాల్లో లేదా.. ఇతర రంగాల్లో వస్తాయని భావించే మార్పులను గుర్తించి ఆ రంగాల్లో ముందస్తుగా పెట్టుబడులు పెట్టకపోతే ఎంత పెద్ద సామ్రాజ్యం అయినా కుప్పకూలిపోతుంది. వ్యాపారాల్లో, పెట్టుబడుల్లో ఇదే కీలకం.
ప్రపంచం ఎప్పటికప్పుడు మారిపోతోంది. టెక్నాలజీ ఈ రోజు ఎలా ఉందో.. రేపు అలా ఉండదు. మరింత అడ్వాన్స్ గా ఉంటుంది. ఒకప్పుడు ఫ్లాపీ డిస్కులు ఉండేవి. తర్వాత సీడీలు వచ్చాయి. ఆ తర్వాత పెన్ డ్రైవ్ లు వచ్చాయి. ఇప్పుడు పెన్ డ్రైవ్ ల వాడకం కూడా తగ్గిపోయింది. ఇలా మార్పులు వస్తూనే ఉన్నాయి. ఎప్పటికిప్పుడు పనుల్ని ఈజీ చేసే టెక్నాలజీ అభివృద్ధి జరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో ఒక సారి పనికొచ్చిన ఐడియా మరోసారి ఉపయోగపడదు. నిరర్థకం అవుతుంది. అందుకే కొత్త కొత్త ఆలోచనలో మార్పును ఊహించగలగాలి.
దావోస్లో చంద్రబాబు, లోకేష్ ఆ కోణంలోనే తమ రాష్ట్రానికి పెట్టుబడులు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్ లో అత్యంత కీలకంగా మారుతాయని భావిస్తున్న గ్రీన్ హైడ్రోజన్ తో పాటు వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. గ్రీన్ హైడ్రోజన్ వచ్చే పదేళ్లలో ప్రత్యామ్నాయ ఇంధనం అనుతుందని.. ఆ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిస్తున్నారు. పారిశ్రామికవేత్తల సమావేశాల్లో తమ విజన్ ఆవిష్కరిస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ చెబుతున్న మాటలు పారిశ్రామికవేత్తల్ని ఆకర్షిస్తున్నాయి.