త్రిదండి చినజీయర్ ఆశ్రమానికి చంద్రబాబు వెళ్లడం.. ఆయనకు పాదనమస్కారాలు చేయడం.. చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. హిందూమత పరిరక్షణ కోసం చినజీయర్ స్వామి చేసిన ఉద్యమం చాలా గొప్పదని చంద్రబాబు ప్రస్తుతించారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతలో ఉన్న చినజీయర్ స్వామి ఆశ్రమంలో తిరునక్షత్రోత్సవం పేరుతో ఆయన పుట్టినరోజు వేడుకలు జరిగాయి. దీనికి చంద్రబాబు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం.. పూర్వజన్మ సుకృతమని చెప్పుకొచ్చారు. స్వామివారి వచనాలు శ్రద్ధగా విన్నానని.. స్వామివారు ఏం చెప్పినా అది లోకహితం కోసమేనని అభినందించారు. ఆశ్రమానికి 100 ఎకరాల భూమి ఇచ్చిన రామేశ్వర్రావుని కూడా.. శభాష్ అన్నారు. అంతే కాదు.. ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకుకున్నారు. దీనిపైనా చర్చ జరుగుతోంది.
అయితే.. నిజానికి చినజీయర్ స్వామి అంటే.. చంద్రబాబుకు అంత అమితమైన భక్తి ఏమీ లేదు. చంద్రబాబు ఏ స్వామిజీకి ప్రాధాన్యం ఇవ్వరు. గతంలో.. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే తిరుమల విషయంలో.. చినజీయర్.. విమర్శలు కూడా చేశారు. ఇవన్నీ చంద్రబాబు పట్టించుకోరు. అందుకే స్వయం ప్రకటిత పీఠాల స్వాములు చంద్రబాబుకు వ్యతిరేకమయ్యారు. వ్యతిరేక ప్రకటనలు చేశారు. ఓ వర్గాన్ని టీడీపీకి దూరం చేసేందుకు తమ వంతు సాయం చేశారు. అయితే.. హఠాత్తుగా చంద్రబాబు.. చినజీయర్ తిరునక్షత్రోత్సవానికి హాజరయ్యారు. పాదనమస్కారాలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అందుకే చర్చనీయాంశం అవుతోంది. ఈ కార్యక్రమం మొత్తం.. రామేశ్వరరావు కనుసన్నల్లోనే నడుస్తోంది. శాస్త్రోక్తంగా జరుగుతున్న ప్రతీ కార్యక్రమంలోనూ ఆయన ఉంటున్నారు. చంద్రబాబు… వచ్చిన సమయంలోనూ.. రామేశ్వరరావు .. ఉన్నారు.
చినజీయర్ తిరునక్షత్రోత్సవాలకు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరు కాలేదు. ఆయనే కాదు.. వైసీపీకి చెందిన ఇతర నేతలు కూడా హాజరు కాలేదు. ఎన్నికలకు ముందు.. జగన్మోహన్ రెడ్డి పలుమార్లు.. శంషాబాద్ లోని ముచ్చింతల్ ఆశ్రమానికి వెళ్లి చినజీయర్ ఆశీస్సులు తీసుకున్నారు. పాదయాత్ర ప్రారంభించే ముందు ముగిసే ముందు కూడా ఆశీస్సులు తీసుకున్నారు. గతంలో పరిపూర్ణానంద.. ఓ కార్యక్రమం చేపడితే.. కేసీఆర్ తో సహా వెళ్లారు. కానీ ఇప్పుడు మాత్రం.. తిరునక్షత్రోత్సవానికి హాజరు కాకపోవడం.. చర్చనీయాంశమయింది. అలాగే చంద్రబాబు వెళ్లడం కూడా హాట్ టాపిక్ అయింది.