ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంపై సీఐడీ దాఖలుచేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. కనీసం నోటీసులు జారీ చేసి వాయిదా వేయడానికి కూడా నిరాకరించింది. చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించారని అనిపిస్తే కింది కోర్టులో బెయిల్ రద్దుకు పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సూచించింది. ఐఆర్ఆర్ కేసులో ప్రాథమిక ఆధారాలు కూడా లేవని నిర్ధారించిన హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
అసలు లేని కట్టని… ఒక్క ఎకరం భూసేకరణ చేయని ప్రాజెక్టులో.. లబ్ది పొందారంటూ సీఐడీ కేసు నమోదు చేయడం విచిత్రం అయితే..దానిపై సుప్రీంకోర్టు వరకూ వెళ్లి బెయిల్ రద్దు చేయాలని ఏపీ సర్కార్ కోరడం న్యాయవర్గాలను సైతం విస్మయ పరిచింది. చిత్రంగా మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ ఇస్తే… ఒక్క కేసులోనే బెయిల్ రద్దు పిటిషన్ దాఖు చేశారు. ఇప్పుడు ఈ పిటిషన్ కొట్టేశారు కాబట్టి వేరే కేసుల్లో పిటిషన్లు దాఖలు చేస్తారేమో కానీ.. జగన్ రెడ్డి ప్రభుత్వ తీరుపై న్యాయవర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది.
చంద్రబాబును జైల్లో పెట్టి ఎన్నికలకు పోవాలని జగన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే వరుస కేసులు నమోదు చేశారు. ఒక్క కేసులోనూ ఒక్క ఆధారం చూపించలేకపోయారు. సాక్షిలో విచ్చలవిడిగా రాసుకోవడం.. పార్టీ నేతలతో మాట్లాడించడం తప్ప కోర్టులో ఒక్క ఆధారం చూపించలేకపోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు కు 17ఏ విషయంలో న్యాయమూర్తులు భిన్నమైన తీర్పులు ఇవ్వడంతో.. విస్తృత ధర్మాసనం ముందుకు ఆ అంశం వెళ్లాల్సి ఉంది.