భారత దేశ రాజకీయాల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కుల, మత, ప్రాంత రాజకీయాల పునాదుల మీదే నేతలు ఎదిగి వచ్చారు. అయితే అభివృద్ది ఎజెండాను మోస్తున్న ఒకే ఒక్క నేత చంద్రబాబు. కష్టమో..నష్టమో.. మంచి చేసి ప్రజలను మెప్పించాలని ఆయన అధికారం అందిన ప్రతీ సారి తాపత్రయ పడ్డారు. ఒక సారి మాత్రమే సక్సెస్ అయ్యారు. కానీ ఆయన తన అభివృద్ధి అజెండానే నమ్ముకుంటున్నారు. ఎన్ని అవమానాలు.. వేధింపులు ఎదురైనా 70 ఏళ్ల వయసులోనూ పోరాటం చేస్తున్నారు. దేశ రాజకీయాల్లో అభివృద్ధి బ్రాండ్‌గా ఉన్న చంద్రబాబు 71వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.
చదువుకునే వయసులోనే … నాయకుడిగా చంద్రబాబునాయుడు గుర్తింపు పొందారు. యవజనసంఘాలను ఏర్పాటు చేసి నేతగా పేరు పొందారు. 26ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు. యువ ముఖ్యమంత్రిగా చంద్రబాబు సంస్కరణలు, అభివృద్ధే ఎజెండాగా పనిచేశారు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా పేరు వచ్చింది. హైదారాబాద్ కు మైక్రోసాఫ్ట్ ను తీసుకువచ్చి … ప్రపంచ ఐటీ పటంలో నిలబెట్టేలా చేశారు. ఆనాటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్ కూడా.. చంద్రబాబు పాలనను సెనెట్ లో ప్రస్తావించారు. చంద్రబాబు పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాంతిభద్రతల విషయంలోనూ మెరుగైన స్థితికి చేరుకుంది. ఎక్కడా మత కల్లోలాలు లాంటివి ఉండేవి కావు. ఫ్యాక్షన్ కూడా తగ్గిపోయింది.
భారతదేశంలో ఎప్పుడు ఎన్నికలు ఎప్పుడూ అభివృద్ధి ప్రాతిపదికన జరగలేదు. కులం, మతం, ప్రాంతం రెచ్చగొట్టే అంశాలతోనే జరిగాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారి చంద్రబాబు అభివృద్ధి నినాదంతో 2004లో ఎన్నికలకు వెళ్లారు. సంస్కరణల ప్రభావాలపై ప్రజల్లో వ్యతిరేక ప్రచారం జరగడంతో చంద్రబాబు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఫలాలు కళ్ల ఎదురుగా కనబడుతున్నా… ఐటీ అంటే తమకు కాదని సామాన్యులు అనుకునేలా చేశారు. కానీ అది నేడు వారి జీవితాల్లో పెనుమార్పులు తీసుకు వచ్చింది.
యువ నాయకుడిగానే చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఆయన తన కన్నా చిన్న వారిని కూడా గౌరవంగా గారు అని పలకరిస్తారు. ఎవరు నమస్కారం పెట్టినా ప్రతి నమస్కారం చేస్తారు. ప్రత్యర్థి పార్టీలో ఉండి…తనపై ఎంత విషం చిమ్మినా.. ఏదైనా సాయం కోసం వస్తే.. సాదరంగా ఆహ్వానిస్తారు. గెలుపోటములు రాజకీయాల్లో సహజం. కానీ ఎప్పటికీ నిలిచి ఉండేది పేరు ప్రఖ్యాతులే. నిన్న వచ్చిన విజయాలు ఈ రోజు లేవు. నిన్న ధీరుడు.. వీరుడు అన్నవారు.. ఈ రోజు పనికిమాలిన వాడు. అహంకారి అంటారు. అభివృద్ధి రాజకీయాలతో పదవి పోగొట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు ఆ స్టేజ్‌లో ఉన్నారు. కానీ ఆయన రాజకీయాలు కొన్ని లక్షల మంది మధ్యతరగతి కుటుంబాలకు చింత లేకుండా చేశాయన్నది వాస్తవం.
హ్యాపీ బర్త్‌డే టు చంద్రబాబునాయుడు..!