కేంద్రంలో భాజపా సర్కారుకు వ్యతిరేకంగా మహా కూటమి ఏర్పాటుకు మరో ముందడుగు పడుతోంది. ఈ నెల పంతొమ్మిదిన కోల్ కతాలో జరుగుతున్న మహాధర్నాకు భాజపా వ్యతిరేక పార్టీలన్నీ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కూటమి ఏర్పాటుకు అక్కడే కీలకమైన నిర్ణయం జరిగే అవకాశం ఉంది. ఇదే అంశమై చర్చించేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు. మంగళవారం సాయంత్రం ఏడు గంటలకు ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు… ముందుగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో గంట సేపు చర్చించారు. ఆ తరువాత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లాతో భేటీ అయ్యారు. ఈ మీటింగులన్నీ ముగించుకుని తిరిగి రాత్రి 11 గంటలకు విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యారు.
కోల్ కతాలో జరిగే ర్యాలీకి మమతా బెనర్జీ ఆహ్వానించారనీ, అదే విషయమై శరద్ పవార్ తో చర్చించేందుకు ఢిల్లీకి వచ్చానన్నారు చంద్రబాబు. కోల్ కతాకి భాజపాయేతర పార్టీలన్నీ వస్తాయనీ, ఆరోజున మహా కూటమి భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు చర్చించి తీసుకుంటామన్నారు. ర్యాలీకి ఏయే పార్టీలు హాజరౌతాయనేది కూడా రెండ్రోజుల్లో స్పష్టత వస్తుందని చెప్పారు. కొన్ని రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో కొన్ని ఇబ్బందులున్నప్పటికీ, దేశం కోసం అందరూ చేతులు కలపాల్సిన సందర్భం ఇది అన్నారు. భాజపా వ్యతిరేక వేదికపైకి అందర్నీ తీసుకొచ్చే బాధ్యత సీనియర్లుగా తమపైన ఉందన్నారు.
నిజానికి, ఆ బాధ్యత చంద్రబాబు నాయుడే తీసుకున్నారు అని చెప్పాలి. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, బీఎస్పీలు సొంతంగా సీట్ల సర్దుబాట్లు చేసేసుకున్నాయి. కాంగ్రెస్ ని పరిగణనలోకి తీసుకోలేదు. మరికొన్ని పార్టీలు కూడా సొంతంగా ఎన్నికల బరిలోకి సిద్ధమన్నట్టు తయారౌతున్నాయి. భాజపాయేతర కూటమిలో కాంగ్రెస్ నాయకత్వంలో పనిచేయడంపై కాస్త ఆలోచిస్తున్న పార్టీలూ ఉన్నాయి. వీటన్నింటినీ ఒప్పించాల్సిన బాధ్యతను చంద్రబాబు తనపై వేసుకున్నారు. నేతలందరితోనూ తానే స్వయంగా మాట్లాడతానని అంటున్నారు. వాస్తవానికి, భాజపాకి వ్యతిరేకంగా తామూ పోరాడతాం అని చెప్తున్న పార్టీలైతే ఉన్నాయిగానీ… పోరాడేవారందరినీ ఒక దగ్గరకి చేర్చే ప్రయత్నం చేస్తున్నది టీడీపీ మాత్రమే. పంతొమ్మిదిన జరిగే భేటీలో కూడా చంద్రబాబు నాయుడు కీలకపాత్ర పోషించాల్సిన అవసరం కనిపిస్తోంది.