తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఖాళీగా ఉన్నారు. సీఎంగా ఉంటే… ఆయనకు తీరిక ఉండేది కాదు. ఇప్పుడు పార్టీ కార్యక్రమాలను కూడా ఆన్ లైన్ ద్వారా చేసేస్తూ.. భవిష్యత్ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన వ్యూహాల్లో బీజేపీ అగ్రస్థానంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఢిల్లీ బీజేపీ నేతలకు ఏదైనా కష్టం వస్తే మాట కంటే ముందే ఫోన్ చేసి.. క్షేమ సమాచారాలు తెలుసుకుంటున్నారు. గతంలో అమిత్ షా కరోనా బారిన పడి కోలుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఒకటి , రెండు సార్లుఫోన్ చేసి.. బాగున్నారా అని పలకరించిన చంద్రబాబు .. తాజాగా మరోసారి ఫోన్ చేసి.. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రాజకీయాలు మాట్లాడారో లేదోస్పష్టత లేదు. అమిత్ షాకు ఫోన్ చేసి పరామర్శించిన తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న కేంద్ర మంత్రి గోయల్‌ను కూడా ఫోన్లో పలకరించారు. కిడ్నీలో రాళ్లు రావడంతో గోయల్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. బీజేపీతో పరిచయాలు పెంచుకోవడానికి చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని వీటి ద్వారా తెలుసుకోవచ్చు. ఇందులో రహస్యమేం లేదు. చంద్రబాబు మాటలు కలిపితే… ఎంతటి వారిననయినా.. తన ప్రతిపాదనలకు అంగీకరింపచేస్తారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది.
కూటములు కట్టడం కానీ.. ఫలితాలను లాభాల వారీగా విశ్లేషించి చెప్పడంలోనూ ఆయన స్టైలే వేరని చెబుతారు. నిజంగా చంద్రబాబు..మళ్లీ బీజేపీని మచ్చిక చేసుకోవాలని అనుకుంటూంటే మాత్రం.. ఆయనకు ఈ ఫోన్ కాల్స్ బాగా ఉపయోగపడతాయి. చంద్రబాబు రాజకీయ చర్చల గురించి బాగా తెలుసు కాబట్టే..అధికార పార్టీ ఉలిక్కి పడుతోంది. బీజేపీతో మళ్లీ జట్టుకట్టడానికి ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.