ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు పని చేస్తున్నారు. చంద్రబాబు కేబినెట్ లో మంత్రులంతా ప్రతీ రోజూ పని చేస్తున్నారు. ఏదో ఓ పని పెట్టుకుని సమీక్షలు చేస్తున్నారు. తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దగ్గర నుంచి కార్మిక మంత్రి సుభాష్ వరకూ అందరూ కష్టపడుతున్నారు. ఇందులో వింతేముంది పని చేయడానికే కదా వారికి పదవులు ఇచ్చింది అని ఎవరికీ అనిపించడం లేదు.. భలే పని చేస్తున్నారే అనుకుంటున్నారు. ఎందుకంటే…గత ప్రభుత్వంలో మంత్రులు వేసిన ముద్ర అలాంటిది మరి.
జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క మంత్రికి అయిన పేషీలో కనీసం యాక్సెస్ ఉండేది కాదు. ఎవరు ఎప్పుడు రావాలో సలహాదారు ఆఫీసు నుంచి సమాచారం వస్తే వచ్చి సంతకాలు పెట్టిపోయేవాళ్లు. మంత్రి ఆఫీసులో అటెండర్ కూడా ఆయన మాట వినరు. ఎప్పుడూ సచివాలయానికి వచ్చి సమీక్షలు చేసిందే లేదు. పేరుకు డిప్యూటీ సీఎం హోదాల్లో ఐదుగురు ఉంటారు. వారికి కనీసం తమ నియోజకవర్గాలను దాటి వచ్చే అవకాశమే ఉండదు. ఇక శాఖలపై సమీక్షలు కూడానా. జగన్ హయాంలో వ్యవసాయమంత్రిగా ఉన్న కాకాణి సర్వేపల్లిలో కలెక్షన్లలో బిజీగా ఉంటారు. ఏమైనా జరిగితే ఓ వీడియో .. సర్వేపల్లి నుంచే రిలీజ్ చేస్తారు. ఇక మద్యం మంత్రిగా ఉండే నారాయణస్వామి అయితే తన నియోజకవర్గంలో లేకపోతే తిరుమల శ్రీవారి దర్శనంలో పాల్గొనేవారు. విడదల రజనీకి మాత్రం మొదట్లో కొన్ని ప్రివిలేజెస్ ఇచ్చారు. తర్వాత అవి కూడా తీసేశారు.
హోంమంత్రిగా మొదట సుచరిత..తర్వాత వనిత ఉన్నారు. ఎంత పెద్ద ఘటనలు జరిగినా స్పందించేవారు వేరుగా ఉంటారు. ఇప్పుడున్న హోంమంత్రి అనిత.. రోజూ రివ్యూలు చేస్తూ.. పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారు. గీత దాటే ఆఫీసర్లకు వార్నింగ్లు ఇస్తున్నారు. పోల్చి చూస్తూండటం వల్ల ఇవాళ మంత్రుల పనితీరు ప్రజల్ని అబ్బుర పరుస్తోంది. చంద్రబాబు హయాంలో శాఖల్ని ఎవరికి వారు నిర్వహించాలి . తమదైన ముద్ర వేయాలి. అంతే కానీ సకల శాఖా మంత్రిగా ఒక్కరిని ప్రోత్సహించరు. ఆ విషయంలో టీడీపీ ప్రభుత్వం నిజమైన ప్రజాస్వామ్య సంప్రదాయాల్ని పాటిస్తుంది. మంత్రులని డమ్మీలుగా కాకుండా పవర్ ఫుల్గా గుర్తిస్తుంది.