సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ ను సీజేఐ బెంచ్ ముందు మెన్షన్ చేసే అవసరం లేకుండానే విచారణ తేదీని ఖరారు చేశారు. చంద్రబాబు తరపు లాయర్లు మెన్షన్ చేసేందుకు మెమో దాఖలు చేశారు. అయితే సీజేఐ ఈ రోజు రాజ్యాంగ ధర్మానసం కేసుల విచారణ చేయనున్నందున ఇతర పిటిషన్లను విచారణ చేసే అవకాశం లేదు. ఈ కారణంగా మెన్షన్ చేసే అవకాశం లేకుండానే విచారణ తేదీని ఖరారు చేశారు. బుధవారం సుప్రీంకోర్టులో జరగనున్న విచారణ జాబితాలో చంద్రబాబు పిటిషన్ ఉంది. ఏ బెంచ్ పై విచారణ జరుగుతుందో సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
శనివారం చంద్రబాబు తరపు లాయర్లు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే లిస్ట్ అయింది కానీ విచారణ తేదీ ఖరారు కాలేదు. దాంతో చంద్రబాబు తరపు లాయర్లు సోమవారం సీజేఐ ముందు ప్రస్తావించారు. మెన్షన్ లిస్టులో లేకపోవడంతో సీజేఐ మెన్షన్ లిస్ట్ ద్వారా మంగళవారం రావాలని సూచించారు. ప్రకారం మెన్షన్ కోసం మెమో దాఖలు చేశారు. బుధవారం విచారణ చేపట్టేందుంకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సుప్రీంకోర్టుకు ఇరవై ఎనిమిదో తేదీ నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకూ సెలవులు ఉన్నాయి.
మరో వైపు ఏసీబీ కోర్టులో చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ చేయాల్సిన జడ్జి హిమబిందు సెలవుపై వెళ్లారు. దీంతో ఇంచార్జ్ గా మరో జడ్జి సత్యానందం విచారణ చేపట్టారు. బుధవారానికి వాయిదా వేశారు. కస్టడీ పిటిషన్ పై చంద్రబాబు తరపు లాయర్లు కౌంటర్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ అంశాన్నీ ప్రస్తావించారు. బుధవారం సీఐడీ కోర్టులో ప్రస్తావించాలని జడ్జి సూచించారు.