రాష్ట్రానికి న్యాయం జరిగే వరకూ అన్ని రకాల వేదికలపైనా ఏపీ గళాన్ని వినిపించాలంటూ ఎంపీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పటికే పార్లమెంటులో పోరాటం చేస్తున్నామనీ, ఇప్పుడు పార్లమెంటరీ కమిటీలలో కూడా తమ గళాన్ని తీవ్రంగా వినిపించాలన్నారు. ఈ కమిటీల సమావేశంలో ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రధానంగా ప్రస్థావించాలనీ, రాష్ట్రానికి న్యాయం జరిగేవరకూ పోరాటం ఆపేది లేదంటూ సీఎం స్పష్టం చేశారు. ఇదీ.. జాతీయ స్థాయిలో టీడీపీ ఎంపీలు వినిపించాల్సిన వాదన, ఢిల్లీ స్థాయిలో భాజపాను చంద్రబాబు డీల్ చేస్తున్న విధానం! ఇక, రాష్ట్రస్థాయికి వచ్చేసరికి ఇక్కడి భాజపాతో టీడీపీ అనురిస్తున్న విధానం అందుకు భిన్నంగా ఉంటోంది!
ఆంధ్రాకు అన్యాయం జరిగిందని తాము అడుగుతూ ఉంటే.. కేంద్రం చేసిన సాయంపై రాష్ట్ర భాజపా నేతలు వివరణ ఇస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఈ వివరణలు వింటూ కూర్చోవద్దని నేతలకు ఉద్బోధించారు. రాజకీయంగా ఎవరెన్ని మాట్లాడినా వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కేంద్రం ఇచ్చినది ఎంతో, రాష్ట్రానికి రావాల్సినది ఎంతో ప్రజల్లోకి తీసుకెళ్దామన్నారు. సో.. ఇదీ రాష్ట్ర స్థాయిలో భాజపాపై టీడీపీ వైఖరి. ఒకేపార్టీతో ఒకే సందర్భంలో జాతీయ స్థాయిలో ఒకలా, రాష్ట్రంలో మరోలా డీల్ చేస్తున్నారు! భాజపాపై నేరుగా పోరాటానికి దిగితే రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లే ఆస్కారం ఉంటుంది కాబట్టి… జాతీయ స్థాయిలో సున్నితమైన ధోరణితో వ్యవహరిస్తోంది. ఇక, రాష్ట్ర స్థాయికి వచ్చేసరికి ఇక్కడి భాజపా నేతల దూకుడు తీవ్రంగా ఉంటోంది కాబట్టి, వీరి పట్ల టీడీపీ అనుసరిస్తున్న వైఖరి మరోలా కనిపిస్తోంది.
ఇక, రాష్ట్ర భాజపా నేతల తీరు కూడా టీడీపీపై కక్ష సాధింపునకు ఇదే సరైన సందర్బం అన్నట్టుగా ఉంది. కేంద్ర ప్రాయోజిత పథకాల క్రెడిట్ తమకు దక్కనీయకుండా చేస్తున్నారంటూ చంద్రబాబుపై ఎప్పట్నుంచో ఏపీ భాజపా నేతలు గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి, దాన్ని పరిపూర్ణంగా వినియోగించేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నవ్యాంధ్రకు భాజపా ఏమీ ఇవ్వలేదన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లిపోయిందనీ, ఏపీలో భాజపాను విలన్ గా చంద్రబాబు చిత్రించారంటూ నిన్నటి సమావేశంలో భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే.. కేంద్ర భాజపా వెర్సెస్ చంద్రబాబు వెర్సెస్ రాష్ట్ర భాజపా అన్నట్టుగా ఉంది. రాష్ట్ర భాజపా నేతల విమర్శల్ని తిప్పికొట్టేందుకు టీడీపీ వ్యూహం ఒకలా ఉంటే, జాతీయ స్థాయిలో టీడీపీ చేస్తున్న పోరాటాన్ని తిప్పికొట్టేందుకు రాష్ట్ర భాజపా నేతలు అనుసరిస్తున్న వ్యూహం మరోలా కనిపిస్తోంది. భాగస్వామ్య పక్షాల మధ్య చాలా విచిత్రమైన పరిస్థితి ఇది..!