స్వర్గీయ ఎన్టీఆర్ దుష్ట కాంగ్రెస్ అనేవారనీ, ఇప్పుడు తాను దోస్త్ కాంగ్రెస్ అంటున్నానంటూ ప్రధాని ఎద్దేవా చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా అచ్చంపేటలో జరిగిన జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నాకు నేనే హైకమాండ్ అనీ, ఎవ్వరికీ దాసోహం చేయాల్సిన అవసరం టీడీపీకి లేదన్నారు. ఎన్టీఆర్ సిద్ధాంతాల ప్రకారమే టీడీపీ నడుస్తోందనీ, అహంభావంతో ఆత్మగౌరవం దెబ్బ తీసేలా ఎవరైనా ప్రయత్నిస్తే బొబ్బిలి పులిలా పార్టీ ముందుకు లేచిందని సీఎం అన్నారు. ఆంధ్రాకి కాంగ్రెస్ పార్టీ కంటే భాజపా ఎక్కువ అన్యాయం చేసిందన్నారు. కాంగ్రెస్ హయాంలో విభజన చట్టం తీసుకొచ్చారనీ, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఆ పార్టీ హయాంలోనే వచ్చిందని గుర్తుచేశారు.
మనల్ని ఏకాకిని చేసి దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తుంటే, పదిమందిని కలుపుకుని ముందుకు వెళ్లాననీ, రాష్ట్రంతోపాటు దేశంలోని రాజ్యాంగబద్ధ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తున్న భాజపాకి వ్యతిరేకంగా రాజకీయ శక్తులను ఏకం చేసే ప్రయత్నం చేశానని చంద్రబాబు అన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించేందుకు కేంద్రం ప్రయత్నించిందన్నారు. తెలంగాణలో తానేదో ఓడిపోయినట్టు ప్రచారం చేస్తున్నారనీ, ప్రధానిమంత్రితోపాటు అమిత్ షా, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి కూడా అక్కడ ప్రచారం చేస్తే భాజపాకి వచ్చిన సీట్లు ఎన్ని అని ప్రశ్నించారు. ఆంధ్రాలో ఏ ఒక్కరూ భాజపాకి ఓటేసే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకునే క్రమంలో పోరాటం తప్ప వేరే మార్గం లేదనీ, అందుకే ఎన్డీయే నుంచి బయటకి వచ్చామని మరోసారి చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవిశ్వాస తీర్మానం పెడితే ఆరోజున కూడా టీడీపీ ఎంపీలను సస్పెండ్ చేశారనీ, ఇవాళ్ల కూడా సస్పెండ్ చేశారనీ, అయినా వెనకడుగు వేసే ప్రసక్తిలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీడీపీ చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నాననంటూ ప్రధానికి చంద్రబాబు సవాల్ చేశారు.
కులం మతం పేరుతో ఏదో చేస్తామంటూ కొంతమంది హామీలు ఇస్తున్నారనీ, జగన్ అదే పనిలో ఉన్నారన్నారు. ఆయనకి ఎలాంటి అనుభవం లేదనీ, ఎప్పుడైనా పంచాయతీ అధ్యక్షుడిగా పనిచేశారా అంటూ ప్రశ్నించారు. లెక్కలు రాస్తూ దొరికిపోయిన అలాంటి వ్యక్తి ప్రజలకు న్యాయం చేయలేరన్నారు. ఆయన మెడపై కేసుల కత్తులున్నాయనీ, ముందుగా వాటి నుంచి తప్పంచుకోవడం కోసమే ఆయన చూస్తారని విమర్శించారు. ఫ్యాక్ట్స్ ఫైడింగ్ అంటూ పవన్ కల్యాణ్ హడావుడి చేశారే తప్ప, ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు. చివరిగా కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ గురించి కూడా మాట్లాడుతూ… ఇలాంటివి చాలా చూశామని చెప్పారు.