విభజన తరువాత ఒక్కో సవాల్ ఎదుర్కొంటూ ఆంధ్రాను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనవంతు శ్రమపడ్డారు. దానికి తగ్గ ఫలితాలు కూడా వస్తున్న సమయం ఇది. కేంద్రంలోని మోడీ సర్కారు నుంచి సాయం అందకపోవడంతోపాటు, రాజకీయ కక్ష సాధింపులకు భాజపా దిగిన పరిస్థితి. ఈ సవాళ్లన్నీ ఒకెత్తు అయితే… ప్రతిపక్ష పార్టీ నుంచి ఇంకోరకమైన మోకాలడ్డే పరిస్థితులు. వీటన్నింటినీ దాటుకుని ప్రభుత్వాన్ని నడుపుకుంటూ వచ్చారు. అయితే, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో విపక్షాల నుంచి ఎదురౌతున్న మరో సవాలు ఏంటంటే… కుటిల రాజకీయాలు! ఒంటరిగా టీడీపీని ఎదుర్కొనే పరిస్థితి ఏపీలో ప్రతిపక్షానికి లేదన్నది వారే చేష్టల్ని బట్టీ ఇస్తున్న సంకేతాలుగా భావించొచ్చు. ఎన్నికల్లో టీడీపీని ఎదుర్కోవడం కోసం తెరాస సాయాన్ని తెచ్చుకుంటున్న పరిస్థితి. వీరికి పైనుంచి భాజపా మద్దతు కూడా లేదని చెప్పలేని పరిస్థితి.
ఎన్నికలు వచ్చేసరికి… రాష్ట్రంలో కులాలు, మతాలు, వర్గాలవారీగా విభజన చేసి, ఒక రకమైన ఎమోషనల్ వాతావరణాన్ని సృష్టించి లబ్ధిపొందే ప్రయత్నం ప్రతిపక్షంతోపాటు దానికి మద్దతుగా నిలుస్తున్న పార్టీలు చేస్తున్నాయి. బీసీలను ఏకం చేస్తానంటూ తెలంగాణ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బయల్దేరి వచ్చారు. ఓబీసీలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ.. అగ్రకులాలకు ప్రాధాన్యత ఇచ్చేస్తున్నామంటూ భాజపా ప్రచారం మొదలుపెట్టేసింది. కులాలకు అతీతంగా రాజకీయం చేస్తానని పవన్ కల్యాణ్ చెబుతున్నా… ఆ స్థాయి సమానత్వాన్ని ఆచరణ పెట్టేలేని పరిస్థితి జనసేనలో కనిపిస్తోంది. చివరికి, ఒక సామాజిక వర్గాన్ని ప్రధానంగా ఆకట్టుకోవడమనే ప్రాతిపదికనే ఆ పార్టీ ముందుకు సాగుతోంది. ఇవన్నీ చూస్తుంటే… ఎన్నికలు వచ్చేనాటికి ఏపీలో ఏదో ఒకరకంగా కుటిల రాజకీయాలకు చేసేందుకు కావాల్సిన నేపథ్యం ఏర్పడుతున్న దిశగా కనిపిస్తోంది.
వీటన్నింటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెక్ పెడుతున్నారని చెప్పొచ్చు. ఈ మధ్య ప్రభుత్వం వరుసగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. పెన్షన్లను రెట్టింపు చేయడం, ప్రజల సొంత ఇంటి కలను నిజం చేయడం, రైతులకు ఊరట నిచ్చే నిర్ణయాలు… ఇలా వరుసగా వివిధ సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఎన్నికల ముందు ప్రజలను ఆకర్షించాలనే ఉద్దేశమే అని విమర్శల్ని విపక్షాలు చేస్తున్నా… అంతకుమించి, కుల మత వర్గ ప్రాతిపదిక ప్రజలను రెచ్చగొట్టేందుకు విపక్షాలు చేస్తున్న ప్రయత్నాలకి ఈ నిర్ణయాలు చెంపపెట్టు అనడంలో సందేహం లేదు. ప్రభుత్వం అమలు చేస్తున్న, చేయబోతున్న పథకాలన్నీ కులాలకీ మతాలకీ అతీతంగా ప్రజలందరికీ చేరతాయి. చాలా సులువుగా కుల మతాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని కొన్ని పార్టీలు ప్రయత్నిస్తుంటే… వాటికి అతీతంగా సంక్షేమం అందరికీ అందే నిర్ణయాలను చంద్రబాబు తీసుకుంటారు. వారు రాజకీయం చేస్తుంటే, చంద్రబాబు సంక్షేమంతో తప్పికొట్టు ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు.