ఒకప్పుడు తమలో వీసమెత్తు పొరపాటు చూపిస్తే రాజకీయ నాయకులు తమ పదవులకు రాజీనామాలు చేసి తప్పుకొనేవారు. వారు మహానుభావులు. రాజకీయాలకు గీటురాళ్ళ వంటివారు. కానీ నేడు తీవ్ర నేరారోపణలపై జైలుకి వెళ్లి వచ్చినా, అవినీతి కేసుల్లో కోర్టులు శిక్షలు విధించినా, ఫోన్ ట్యాపింగ్, స్టింగ్ ఆపరేషన్లలో అడ్డంగా దొరికిపోయినా తాము నిప్పులాంటి వాళ్ళమని నిసిగ్గుగా చెప్పుకొంటూ తిరుగుతున్నారు. కోర్టులలో సాక్ష్యాధారాలతో సహా నేరారోపణలు ఎదుర్కొంటున్నా కూడా అవన్నీ తమ ప్రత్యర్ధులు రాజకీయ కక్షతో పెట్టిన భూటకపు కేసులని వాదిస్తున్నారు. తమ రాజకీయ ప్రత్యర్ధులు ఉద్దేశ్యపూర్వకంగానే తమపై కుట్రలు పన్ని ఉచ్చులో పడేశారని నిసిగ్గుగా వాదిస్తున్నారు. జైల్లో ఉండి వచ్చిన మన రాజకీయ నేతలు అదేదో చాలా ఘనకార్యమన్నట్లు ప్రజలకు రెండు వేళ్ళతో విక్టరీ సింబల్ చూపిస్తూ భారీ ఊరేగింపుగా జైలు నుండి బయలుదేరుతున్నారు.
దురదృష్టకరమయిన విషయం ఏమిటంటే ప్రజలు కూడా అటువంటి వారి తప్పులను చాలా ఉదారంగా క్షమించేయడమే కాకుండా మళ్ళీ వారికే జై కొడుతుంటారు. అటువంటప్పుడు నేరం చేసిన ఏ రాజకీయ నాయకుడు ప్రజలకు భయపడతాడు? ఎందుకు సిగ్గుపడతాడు? ఓటుకి నోటు కేసులో కేసులో చంద్రబాబు నాయుడు పాత్ర గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు. అలాగే ఆయన ఆ కేసు నుండి ఏవిధంగా తెలివిగా బయటపడ్డారో అందరికీ తెలిసిందే. కానీ ఆయన తను నిప్పులాగ బ్రతుకుతున్నానని చెప్పుకొన్నారు. గత నాలుగు దశాబ్దాలుగా తను అనుసరిస్తున్న విధానాల వలననే ప్రజలలో తనకు విశ్వసనీయత ఉందని అదే తనకు శ్రీరామ రక్ష అని చెప్పుకొన్నారు. ప్రజలు తమ గురించి ఏమనుకొంటున్నారనే విషయం తెలుసుకొంటే అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ తమ గురించి తామేమనుకొంటున్నామనే సంగతి ప్రజలకి చెప్పడానికి చాలా సౌక్యంగా, గొప్పగా ఉంటుంది. అందుకే మన రాజకీయ నాయకులు తాము చెప్పేదే నిజమని ప్రజలను నమ్మమని గట్టిగా చెపుతుంటారు.