టెండర్ల విషయంలో న్యాయవ్యవస్థ ప్రమేయం లేకుండా.. ఆ వ్యవస్థను భాగం చేస్తూ.. ఏపీ సర్కార్ ఓ బిల్లును సిద్ధం చేసింది. దానికి కేబినెట్లోనూ ఆమోదం తెలిపింది. జ్యూడిషియల్ కమిషన్లో హైకోర్టు జడ్జి ఉంటారని.. ఇప్పటి వరకూ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఓ సారి.. హైకోర్టు చీఫ్ జస్టిస్తోనూ సమావేశమయ్యారు. అప్పుడు దీనిపై చర్చించినట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత న్యాయవ్యవస్థ నుంచి దీనిపై ఎలాంటి కమ్యూనికేషన్ జరిగినట్లు ప్రభుత్వం చెప్పలేదు. కానీ.. బిల్లును మాత్రం రూపొందించేశారు.
పరిపాలన.. టెండర్ల ఖరారు వంటి అంశాల్లో న్యాయవ్యవస్థ జోక్యమే చేసుకోదని.. న్యాయనిపుణులు చెబుతున్నారు. రాజ్యాంగబద్ధంగా ప్రతి వ్యవస్థకు కొన్ని విధులు, పరిమితులు ఉంటాయని.. వాటి వరకే వ్యవహరిస్తారని… గుర్తు చేస్తున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. మీడియా ముందు స్పష్టం చేశారు. జగన్ చెబుతున్న జ్యూడిషియల్ కమిషన్ సాధ్యం కాదని… ఆయన అవాస్తవాలు చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. రాజకీయాల కోసం.. న్యాయవ్యవస్థను జగన్ వాడుకుంటున్నారని… చంద్రబాబు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే… జ్యూడిషియల్ బిల్లుకు.. ఏపీ సర్కార్ ఆమోదం తెలిపింది. అయితే.. ఇందులో.. హైకోర్టు జడ్జి లేదా.. రిటైర్డ్ జడ్జి అని పెట్టడంతోనే.. నిపుణుల వాదన కరెక్టేనని.. రాజకీయ పార్టీల్లోనూ చర్చ ప్రారంభమైంది.
టెండర్ల కోసం ఉద్దేశించిన జ్యూడిషియల్ కమిటిలో ఉండేందుకు హైకోర్టు న్యాయమూర్తికి నిబంధనలు అంగీకరించవు. అది సాధ్యం కాదు. ఏపీ సర్కార్ చట్టం చేసినా.. అది వారికి వర్తించదు. ఆ విషయం.. జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టే… హైకోర్టు జడ్జి లేదా రిటైల్డ్ జడ్జి అనే ప్రస్తావన పెట్టారంటున్నారు. నేరుగా హైకోర్టు జడ్జి నేతృత్వం వహిస్తే.. అది జ్యూడిషియల్ కమిషన్ అవుతుంది కానీ… రిటైర్డ్ జడ్జి నాయకత్వం వహిస్తే.. అది జ్యూడిషియల్ కమిషన్ అయ్యే అవకాశం ఉండదని నిపుణులు అంటున్నారు. జడ్జిలు ఇలాంటి పనుల్లో పాలు పంచుకోరని.. అందుకే వెసులుబాటు కోసమే రిటైర్డ్ జడ్జి పేరును తెరపైకి తెచ్చారని చెబుతున్నారు. దీంతో… రాజకీయాల కోసం.. జగన్మోహన్ రెడ్డి న్యాయవ్యవస్థను వాడుకుంటున్నారనే అభిప్రాయం బలపడుతోందని టీడీపీ నేతలంటున్నారు.