రాజకీయ అవకాశవాదం మంచిది కాదనీ, ఏపీకి ప్రత్యేక హోదా వద్దని చెబుతున్న కేసీఆర్ ఫొటో పెట్టుకుని ఇక్కడ కొంతమంది ఊరేగుతున్నారంటే… ఏం చెప్పాలంటూ వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. దేశంలో జరుగుతున్న రాజకీయాలను ప్రజలు గమనించాలనీ, ఏదైతే మన రాష్ట్రానికి మంచిది అనేది ప్రతీ ఒక్కరూ ఆలోచించాలన్నారు. ‘నేను భాజపాతో ఎందుకు విభేదించాను? ఎవరి కోసం పోరాటం చేస్తున్నాను? నమ్మించి మోసం చేస్తే ఇంట్లో పడుకోవాలా..?’ అంటూ ఉద్వేగంగా అన్నారు. ప్రత్యేక హోదా గురించి ఇప్పుడీ పార్టీలు ఎందుకు కేంద్రాన్ని అడగడం లేదంటూ వైకాపా, జనసేనలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
స్వతంత్రం వచ్చిన తరువాత దేశంలో ఒకేసారి ఒక్కసారి థర్డ్ ఫ్రెంట్ అధికారంలోకి వచ్చిందని సీఎం గుర్తుచేశారు. అది కూడా తాను కన్వీనర్ గా ఉన్నప్పుడు వచ్చిన యునైటెడ్ ఫ్రెంట్ అనీ, అప్పుడు దేవేగౌడను, గుజ్రాల్ ను ప్రధానులుగా చేశామన్నారు. ఆరోజున కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు ఇచ్చిందన్నారు. కేసీఆర్ ని ఉద్దేశించి మాట్లాడుతూ… ‘ఇప్పుడు కొంతమంది ఏదో చెబుతున్నారు. బీజేపీ లేకుండా, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్థాయిలో గవర్నమెంట్లు ఏర్పాటు చేస్తామని. ఎవరిని మోసం చేయడానికి అని అడుగుతున్నా..? ఆంధ్రాకి 25 మంది ఎంపీలుంటే, తెలంగాణలో 17 మంది ఉంటే… మొత్తం 540 మందిలో ఎవరి సపోర్టు లేకుండా ఎలా చేస్తారని అడుగుతున్నా’ అంటూ ప్రశ్నించారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఇలాంటి మాటలు వింటే మనం నష్టపోతామనీ, కేంద్రంలో భాజపా ఇంటికిపోతే తప్ప మనకు న్యాయం జరగదన్నారు. భాజపాతో పోరాటానికి మించి వేరే మార్గం ఉందా అని ప్రజలను అడిగారు. కొంతమందికి ఇప్పుడు ఇష్టం లేకపోవచ్చుగానీ, హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తన హయాంలోనే అనీ, అది చరిత్ర అన్నారు. కేసీఆర్ బర్త్ డే గిఫ్ట్ వ్యాఖ్యలని మరోసారి ప్రస్థావిస్తూ… తాను తెలంగాణ వెళ్లి పని చేయడం తప్పు అన్నట్టుగా ఆయన అంటున్నారన్నారు. వైకాపా, జనసేన, తెరాసలను మోడీ ఆడిస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు వ్యాఖ్యల్లో కీలకమైనవి… కేసీఆర్ జాతీయ రాజకీయాలపై చేసిన కామెంట్స్. మూడో ఫ్రెంట్ కు ఆస్కారం లేదని ఆయన విశ్లేషించడం గమనార్హం. మూడో ప్రత్యామ్నాయం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు కాబట్టే… తాను ఈ భాజపా వ్యతిరేక కూటమి కడుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇంకోటి, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న అనివార్య పరిస్థితిని పదేపదే ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో పరిస్థితుల దృష్ట్యా చూస్తే వేరే మార్గం ఉందా అనే చర్చను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ… వారి నుంచే సమాధానాలు రాబడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పొత్తు ఎలాంటి ఫలితాలను ఇచ్చినా… ఆంధ్రాకు ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వేరే ప్రత్యామ్నాయం లేదనే ధోరణిని గట్టిగా చెప్పే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు.