ఆంధ్రాకి కేంద్రం కేటాయింపుల విషయమై లెక్కలు తేల్చేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక కమిటీని ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి ఆంధ్రాకి వచ్చిన నిధులు, ఆంధ్రా చేసిన ఖర్చుల లెక్కలు తనకు ఇవ్వాలంటూ ఆయన కోరిన సంగతీ తెలిసిందే. ఈ కమిటీ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. సమన్వయ కమిటీ భేటీలో ఇదే అంశం చర్చకు రావడంతో ఆయన ఈ కమిటీపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. పవన్ ఏర్పాటు చేస్తున్న కమిటీతో టీడీపీకి వచ్చే ఇబ్బందేమీ ఉండదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ఏదో ఒక రకంగా మేలు జరగాలనే ఉద్దేశంతోనే పవన్ తన వంతు ప్రయత్నం చేస్తున్నారనీ, ఆయన పోరాటంలో అర్థముందంటూ సీఎం అన్నారు.
అధికార పార్టీగా తమ ఉద్దేశం కూడా రాష్ట్ర ప్రయోజనాలను పోరాడైనాసరే దక్కించుకోవడమే అని అన్నారు. పవన్ ఏర్పాటు చేయబోతున్న కమిటీని సానుకూల దృక్పథంలో చూడాలని టీడీపీ నేతలకు సూచించారు. మిగతా పక్షాలు మాదిరిగా కాకుండా, ఫలితాలు సాధించే రీతిలో, అందరినీ కలుపుకుని పోయే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి ఇంతవరకూ వచ్చిన కేంద్ర నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలన్న పవన్ డిమాండ్ కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సమక్షంలో చర్చకు వచ్చింది. దీనిపై కూడా సీఎం సానుకూలంగా స్పందిస్తూ… కేటాయింపులకు సంబంధించిన వివరాలు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. రాష్ట్రం ఏం చేసిందనే లెక్కలు ఇచ్చేందుకు సిద్ధమని చెబుతూనే, కేంద్రం లెక్కలు ఏంటనేవి భాజపానే శ్వేత పత్రం విడుదల చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
ఒక మిత్రపక్షంగా జనసేనను చూడాల్సిన అవసరం ఉందనీ, అందుకే ఇతర ప్రతిపక్షాలతో డీల్ చేసినట్టుగా కాకుండా వ్యవహరించుకోవాలనే సంకేతాలను పార్టీ శ్రేణులు చంద్రబాబు ఇచ్చారనే చెప్పుకోవచ్చు. ఇంకోపక్క, ప్రత్యేక హోదా కోసం పోరాటం, ఎంపీల రాజీనామాలు అంటూ ప్రతిపక్ష పార్టీ నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో పవన్ కమిటీపై టీడీపీ వైఖరి ఏంటనేది దాదాపు స్పష్టంగానే ఉంది.