ఓ గీతను చిన్నదిగా చేయాలంటే… దాని పక్కన పెద్ద గీతను గీయాలి. ఈ గీతను ఒకప్పుడు.. తీవ్రంగా తప్పు పట్టి ఉన్నప్పటికీ… తప్పదు. చంద్రబాబు అదే చేశారు. జగన్ ను తప్పు పట్టడానికి వైఎస్ ను మంచోడనేశారు. ఫ్యాక్షన్ రాజకీయాల్లో జగన్ తో పోలిస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చాలా బెటరని…సర్టిఫికెట్ జారీ చేసేశారు.. టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీలో టీడీపీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడుల నేపధ్యంలో చంద్రబాబు… వైఎస్ కు.. జగన్ మధ్య పోలిక పెట్టారు. ప్రస్తుతం జరుగుతున్నంతటి రాక్షస పాలన చరిత్రలో చూడలేదని మండిపడ్డారు. జగన్‌ది నీచాతి నీచమైన రాజకీయమని ఫ్యాక్షన్ జిల్లాల నుంచి వచ్చినవారు కూడా ఇలా ప్రవర్తించలేదన్నారు.
వైఎస్ కూడా ఫ్యాక్షన్ రాజకీయాలను కడపకే పరిమితం చేసేవారని .. కడప జిల్లా దాటి వస్తే వైఎస్ పెద్దమనిషిలానే రాజకీయాలు చేశారని గుర్తు చేసుకున్నారు. పులివెందుల పంచాయితీ రాష్ట్రమంతా రుద్దాలని చూస్తున్నారని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో విధ్వంసం నడుస్తోందని … ఆఖరుకు తనను కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే ఓ మహిళ పొలం లాక్కున్నారని …ఆరోపించారు. పోలీసులనూ టీడీపీ అధినేత వదిలి పెట్టలేదు. ఐపీఎస్‌లు కూడా వ్యక్తులకు సరెండర్ కావడం బాధాకరమని .. నమ్మకం పోగొట్టుకున్న తర్వాత డీజీపీ నుంచి కానిస్టేబుల్ దాకా ఉన్నా ఒకటే…లేకున్నా ఒకటేనన్నారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి వంద రోజులు పూర్తయిన సందర్భంగా.. అందరూ తలో రకంగా విశ్లేషణ చేస్తున్న సమయంలో.. చంద్రబాబు… కూడా.. ఘాటైన విమర్శలు చేస్తున్నారు. రివర్స్ లో వెళ్తున్నాం.. తప్పు జరుగుతోంది ఏమీ లేదని అంటున్నారు. ఈ క్రమంలో.. మిగిలిన విషయాల కన్నా..శాంతిభద్రతల అంశాన్నే చంద్రబాబు హైలెట్ చేస్తున్నారు. దాడుల అంశాన్ని.. వైసీపీ నేతలు చేస్తున్న పంచాయతీల్ని.. చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో.. వైఎస్ తో పోలిక తీసుకు రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.